ఇకపై ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఖాతాలకూ ఆధార్‌ను అనుసంధానించాలని కేంద్రం యోచిస్తున్నదట. ఆయా అకౌంట్లకు మీ ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాల్సి వస్తుందట. ఈ మేరకు సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలను విచారణ చేస్తున్నారు.
ఓటర్ ఐడీ కార్డు, పాన్ కార్డు.. మొబైల్ కనెక్షన్, ఇన్సూరెన్స్ పాలసీలు.. ఇలా ఒక్కటేమిటి.. గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి దానికీ ఆధార్‌ను అనుసంధానించాలని ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. అయితే సుప్రీం కోర్టు తీర్పుతో ఏ సేవకూ ఆధార్ అవసరం లేదని చెప్పడంతో.. కేవలం ప్రభుత్వ సంక్షేమ పథకాలను పొందేందుకు మాత్రమే ఆధార్‌ను ఉపయోగించడం మొదలు పెట్టారు. అయితే ఇకపై ఫేస్‌బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియా ఖాతాలకూ ఆధార్‌ను అనుసంధానించాలని కేంద్రం యోచిస్తున్నదట. ఈ క్రమంలో ప్రస్తుతం ఈ వార్త సంచలనం రేపుతోంది.
ఫేస్‌బుక్, వాట్సాప్, గూగుల్ తదితర సోషల్ మీడియా సర్వీసులను బాగా ఉపయోగిస్తున్నారా..? అయితే ఇకపై ఆయా అకౌంట్లకు మీ ఆధార్ నంబర్‌ను అనుసంధానం చేయాల్సి వస్తుందట. ఈ మేరకు సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలను విచారణ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం నకిలీ వార్తలు ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సోషల్ మీడియా ఖాతాలకు వినియోగదారులు తమ తమ ఆధార్ కార్డులను అనుసంధానం చేయాలని మద్రాస్, బాంబే, మధ్యప్రదేశ్ హైకోర్టులలో కొందరు పిల్స్ వేశారు. ఈ విధంగా చేయడం వల్ల సోషల్ మీడియా ప్రభావం తగ్గుతుందని, అశ్లీలతకు చోటు ఉండదని కూడా వారు వాదిస్తున్నారు. అయితే ఈ పిల్స్ అన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేయాలని ఫేస్‌బుక్ గతంలో కోరగా.. ఈ విషయంపై మంగళవారం సుప్రీం కోర్టులో వాదనలు జరిగాయి.
కాగా అందరి వాదనలు విన్న సుప్రీం కోర్టు సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానించడంపై తమ అభిప్రాయాలను వెల్లడించాలని కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. మరోవైపు సెప్టెంబర్ 13వ తేదీ లోగా ఆయా కంపెనీలు కూడా ఈ విషయంపై తమ అభిప్రాయాలను చెప్పాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అయితే ఫేస్‌బుక్, గూగుల్ సంస్థలు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. సోషల్ మీడియా ఖాతాలకు ఆధార్‌ను అనుసంధానిస్తే తమ యూజర్ల ప్రైవసీకి భంగం కలుగుతుందని ఫేస్‌బుక్, గూగుల్‌లు ఆరోపిస్తున్నాయి. మరి ఈ విషయంలో త్వరలో సుప్రీం కోర్టు ఏం తీర్పునిస్తుందో చూడాలి. అయితే ఆధార్‌ను కచ్చితంగా అనుసంధానించాల్సిందేనని సుప్రీం తీర్పు చెబితే.. అప్పుడు తీవ్ర పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. ఇక అప్పటి వరకు మనం వేచి చూడక తప్పదు..!