మేడారం జాతరలో వనదేవతలు ఎలా వస్తారో మీకు తెలుసా ?

-

ప్రపంచంలోనే అతపెద్ద గిరిజన జాతర.. మేడారం జాతర, తెలంగాణలోనే కాదు ఆసియా ఖండంలో కూడా ఇది పెద్ద జాతర. మహా కుంభమేళ తర్వాత ఆస్థాయిలో ప్రజలు వచ్చే జాతర ఇదేనంటే ఆశ్చర్యం కానీ నిజం. ఏటేటా ఈ జాతర ప్రభ మరింత పెరుగుతుంది. కొత్త కొత్త రికార్డులను సృష్టిస్తుంది సమ్మక్క-సారలమ్మ జాతర. గిరిజన మహాకుంభమేళాగా భావించే మేడారం మహా జాతర అట్టహాసంగా ప్రారంభమయ్యింది. జాతర ప్రారంభం కావడానికి 15 రోజులు ముందుగానే మేడారానికి భక్తులు తాకిడి విపరీతంగా పెరిగింది. అయితే రెండేండ్లకోసారి నాలుగు రోజుల పాటు జరిగే ఈ మహాజాతర ప్రారంభమయ్యింది. బుధవారం సాయంత్రం సారలమ్మ గద్దెలపైకి చేరడం మేడారం మహా జాతరలో ప్రధాన ఘట్టం కాగా.. తిరిగి దేవతలు వన ప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. జాతర మొత్తానికి చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకురావడమే ప్రధానఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇదిలావుంటే.. జాతర సందర్భంగా గద్దెలపైకి దేవతలను వివిధ ప్రాంతాల నుంచి తీసుకొస్తుంటారు. దేవతలను తీసుకొచ్చే క్రమంలో గిరిజనుల సంప్రదాయ పూజలు ప్రత్యేకంగా నిలుస్తాయి. జాతర సందర్భంగా ఎవరెవరినీ ఎక్కడెక్కడి నుంచి తీసుకొస్తారనే విశేషాలు తెలుసుకుందాం…

మొట్టమొదట వచ్చే వనదేవత

మేడారానికి మూడు కిలోమీటర్ల దూరంలోని కన్నెపల్లి నుంచి సారలమ్మను వడ్డెలు (గిరిజన పూజారులు) గద్దెలపైకి తీసుకొస్తారు. అంటే ఈ మహా జాతరలో మొట్ట మొదట గద్దెమీదికి వచ్చే వనదేవత సారలమ్మ. ఈ తల్లిని బుధవారం అంటేఫిబ్రవరి 5 సాయంత్రం కన్నెపల్లిలోని సారలమ్మ గుడి వద్ద ప్రధాన వడ్డె కాక సారయ్య గిరిజన సంప్రదాయ పద్ధతుల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం సారలమ్మ అమ్మవారి ప్రతిరూపంగా భావించే పసుపు, కుంకుమ భరిణెలను తీసుకుని వేలాది మంది భక్తులు వెంట రాగా సాయంత్రం నాలుగు గంటల సమయంలో మేడారానికి బయలుదేరుతారు. మేడారానికి వచ్చే క్రమంలో మూడు కిలోమీటర్ల మేర భక్తులు పెద్దఎత్తున బారులుదీరి.. పూజారిని తాకే ప్రయత్నం చేస్తుంటారు. ఇలా అమ్మవారిని తీసుకొచ్చే సమయంలో పూజారిని తాకితే.. సంతాన భాగ్యంలేని వారికి పిల్లలు పూడతారని ఇక్కడి భక్తుల విశ్వాసం. కన్నెపల్లి నుంచి సారలమ్మ గద్దెలపైకి తీసుకొచ్చే క్రమంలో జంపన్న వాగు మీదుగా వస్తూ ఆ వాగులో స్నానమాచరించి.. ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రాత్రి 8 గంటల వరకు గద్దెల వద్దకు చేరుస్తారు. అయితే అప్పటికే ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు, గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్ధరాజులు గద్దెల వద్దకు చేరుకుంటారు. సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్ధరాజులకు ప్రత్యేక పూజలు చేసి గద్దెలపై ప్రతిష్టిస్తారు.

60 కిలోమీటర్లు నుంచి పగిడిద్ధరాజు..

సమ్మక్క భర్త పగిడిద్ధరాజు గంగారం మండలం పూనుగొండ్ల నుంచి గద్దెలపైకి రావాల్సి ఉంటుంది. అయితే మేడారం నుంచి పూనుగొండ్ల 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆదివాసీ పూజారులు ఒకరోజు ముందుగానే అంటే మంగళవారమే.. పగిడిద్ధరాజుకు ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం సాయంత్ర పగిడిద్ధరాజును తీసుకుని 60 కిలోమీటర్ల మేర కాలినడక అడవిమార్గంలో నడుచుకుంటూ.. లక్ష్మీపురానికి చేరుకుంటారు. అక్కడి రాత్రి బస చేసి.. తెల్లవారుజామున ప్రత్యేక పూజలు చేసి బుధవారం సాయంత్రానికి మేడారం గద్దెల వద్దకు చేరుకుంటారు.

కన్నెపల్లి నుంచి జంపన్నను..

సమ్మక్క, పగడిద్ధరాజుల కుమారుడు జంపన్నను కన్నెపల్లి గ్రామం నుంచి మంగళవారమే తీసుకొచ్చారు. కన్నెపల్లి నుంచి ప్రత్యేక పూజల అనంతరం తీసుకొచ్చి జంపన్నవాగులోని గద్దెపైకి సాయంత్రం 5 గంటల సమయంలో ప్రతిష్టించారు.

ప్రధాన ఘట్టంగా చిలకలగుట్ట నుంచి సమ్మక్క రాక..

గద్దెలకు కొద్దిదూరంలో ఉండే చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. గురువారం ఉదయమే గిరిజన పూజారులు గుట్టపైకి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం గురువారం సాయంత్రం వడ్డెలు చిలకలగుట్టపైకి చేరుకుంటారు. అమ్మవారి ప్రతిరూపమైన కుంకుమ భరిణెను తీసుకుని రాత్రి 8 గంటల సమయానికి సమ్మక్క గద్దెపైకి చేరుకుంటుంది. జాతర మొత్తానికి సమ్మక్క రాక అత్యంత ప్రధానంగా నిలవనుంది. శుక్రవారమంతా గద్దెలపై దేవతలుగా భక్తులకు దర్శనమిస్తారు. శనివారం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగుస్తుంది. ఇలా ఆయా ప్రాంతాల నుంచి ఆయా వనదేవతల రాక, తర్వాత తిరిగి వనప్రవేశాలతో జాతర ముగుస్తుంది. భక్తుల కొంగుబంగారం (ప్రసాదంగా సమర్పించే బెల్లం) సమ్మక్క సారలమ్మ. నాడు గిరిజన జాతరగా ప్రారంభమైన నేడు ఇది అందరి జాతరగా మహాకుంభమేళగా మారడం విశేషం.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news