ప్రపంచ కప్ టోర్నీలో వెస్టిండీస్‌కు గట్టి షాక్ తగిలింది. ఆ జట్టు బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్ నిర్దేశించిన 322 పరుగుల భారీ లక్ష్యాన్ని బంగ్లాదేశ్ ఉఫ్ మని ఊదేసింది. కేవలం 41.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి బంగ్లాదేశ్ 322 పరుగులు చేసి విండీస్‌పై 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ సౌతాఫ్రికాకు ఇచ్చిన షాక్ మరిచిపోకముందే ఇప్పుడు విండీస్‌కు షాకిచ్చింది.
మ్యాచ్‌లో టాస్ ఓడిపోయి బ్యాటింగ్‌కు వచ్చిన విండీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 321 పరుగులు చేయగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో షై హోప్ (121 బంతుల్లో 96 పరుగులు, 4 ఫోర్లు, 1 సిక్సర్), లూయీస్ (67 బంతుల్లో 70 పరుగులు, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హిట్‌మైర్ (26 బంతుల్లో 50 పరుగులు, 4 ఫోర్లు, 3 సిక్సర్లు)లు ఆకట్టుకునే ప్రదర్శన చేశారు. ఇక బంగ్లా బౌలర్లలో సైఫుద్దీన్, రహమాన్‌లకు చెరో 3 వికెట్లు దక్కగా, షకిబ్ అల్ హసన్ కు 2 వికెట్లు దక్కాయి.
అనంతరం 322 పరుగుల భారీ లక్ష్యంతో బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఆరంభించగా.. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో ఆల్‌రౌండర్ షకిబ్ అల్ హసన్ 99 బంతుల్లోనే 16 ఫోర్లతో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. అలాగే మరో బ్యాట్స్‌మెన్ లైటన్ దాస్ కూడా కేవలం 69 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 భారీ సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో బంగ్లాదేశ్ సునాయాసంగా విజయం సాధించింది. అయితే నిజానికి బంగ్లా బ్యాట్స్‌మెన్ ఆది నుంచి విండీస్ బౌలర్లకు చుక్కలు చూపించారు. ఏ దశలోనూ వారిని కోలుకోనివ్వలేదు. ఈ క్రమంలో బంగ్లా బ్యాట్స్‌మెన్ బౌండరీ మీద బౌండరీలు బాదుతుంటే విండీస్ ఆటగాళ్లు చూస్తూ ఉండడం తప్ప మరేమీ చేయలేకపోయారు. కాగా వెస్టిండీస్ బౌలర్లలో ఆండ్రూ రస్సెల్, ఒషానె థామస్‌లకు చెరొక వికెట్ దక్కింది.