ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్, ఆల్ రౌండర్ ఆండ్రూ సైమండ్స్ రోడ్డు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. 46 ఏళ్లు ఉన్న ఆండ్రూ సైమండ్స్.. టౌన్స్ విల్లేలో జరిగిన కారు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. అయితే..ఈ దివంగత ఆస్ట్రేలియా క్రికెటర్ ఆండ్రు సైమండ్స్ జ్ఞాపకార్థం టౌన్స్ విల్లే సిటీ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. టౌన్స్ విల్లేలోని రివర్ వే అంతర్జాతీయ క్రికెట్ గ్రౌండ్ పేరును ఆండ్రు సైమండ్స్ స్టేడియం గా మార్చుతున్నట్లు శుక్రవారం ప్రకటించింది.
కాగా సైమండ్స్ టౌన్స్ విల్లే లోనే జన్మించాడు. సైమండ్స్ జూనియర్లను ఎంతోమందిని ఇదే స్టేడియంలో తీర్చిదిద్దాడని, అతని పేరు శాశ్వతంగా నిలిచిపోవాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు టౌన్స్ విల్లే సిటీ కౌన్సిలర్ మౌరి సోర్స్ తెలిపారు. ఇక ఈ స్టేడియం వేదికగా ఇప్పటివరకు హాంకాంగ్, పాపువా న్యూగినియా మధ్య రెండు అంతర్జాతీయ మ్యాచులు మాత్రమే జరిగాయి. ఈ స్టేడియం వేదికగానే ఆగస్టు ఆఖరిలో ఆస్ట్రేలియా – జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరగనుంది. ఆగస్టు 28న జరగనున్న తొలి వన్డే తో ఈ సిరీస్ ప్రారంభం కానుంది.