ఇప్పటి వరకు జరిగిన అనేక క్రికెట్ వరల్డ్ కప్‌లకు ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యాన్ని ఇస్తూ వస్తోంది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం అందించడం కోసం ఆయా దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి.
ఇన్ని రోజులూ వేసవి తాపం నుంచి అల్లాడిపోయిన జనాలకు ఊరట. అంటే వర్షాలు పడుతాయని కాదు. కానీ వర్షం లాంటి సిక్సర్లు, ఫోర్ల మోతకు.. బౌండరీల వానకు క్రికెట్ అభిమానులు తడిసిపోతారన్నమాట. మండు వేసవి నుంచి చల్లని వర్షాకాలానికి కాలం మారుతున్న సమయంలో.. క్రికెట్ పుట్టినిల్లైన ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ ఆరంభం కాబోతోంది. క్రికెట్ ప్రపంచ కప్ సమరం ఆరంభానికి కేవలం మరికొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో ఈ సారి మొత్తం 10 జట్లు వరల్డ్‌కప్‌లో ఆడనున్నాయి. హేమాహేమీలైన బ్యాట్స్‌మెన్, బౌలర్లు, ఆల్‌రౌండర్లతో ఆయా జట్లన్నీ పటిష్టంగా ఉన్నాయి. మరి ఈ సారి వరల్డ్ కప్ ఏ దేశాన్ని వరిస్తుందో మరికొన్ని రోజుల్లో తేలనుంది.
ఇప్పటి వరకు జరిగిన అనేక క్రికెట్ వరల్డ్ కప్‌లకు ఒక్కోసారి ఒక్కో దేశం ఆతిథ్యాన్ని ఇస్తూ వస్తోంది. 4 ఏళ్లకు ఒకసారి జరిగే ఈ టోర్నమెంట్ కు ఆతిథ్యం అందించడం కోసం ఆయా దేశాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటాయి. అయితే ఈ సారి ఆ అదృష్టం ఇంగ్లండ్‌ను వరించింది. దాదాపుగా 20 ఏళ్ల తరువాత మళ్లీ ఇంగ్లండ్‌లో వరల్డ్ కప్ టోర్నమెంట్ జరగబోతోంది. అయితే ఇప్పటి వరకు 20కి పైగా జట్లు ఆయా ప్రపంచ కప్‌లలో పాల్గొన్నాయి. కానీ కేవలం 5 జట్లు మాత్రమే ఈ మెగా టోర్నీలో విజయం సాధించాయి.
క్రికెట్ వరల్డ్‌కప్‌ను ఆస్ట్రేలియా 5 సార్లు చేజిక్కించుకోగా, వెస్టిండీస్, ఇండియాలు చెరో రెండు సార్లు, పాకిస్థాన్, శ్రీలంకలు చెరొక సారి కప్పును సొంతం చేసుకున్నాయి. అయితే ఈ సారి ఇంగ్లండ్ దేశం మాత్రం ఎలాగైనా కప్పును సాధించాలనే ఉత్సుకతతో ఉంది. ఆ జట్టు ఇటీవలి కాలంలో ఆడిన అనేక మ్యాచ్ లలో విజయాలను నమోదు చేసింది. దీంతోపాటు పటిష్టమైన బ్యాటింగ్, బౌలింగ్ లైనప్, ఆల్‌రౌండర్లు ఇంగ్లండ్ జట్టులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఇవాళ సౌతాఫ్రికాతో ఈ వరల్డ్‌కప్‌లో తన తొలి మ్యాచ్‌ను ఆడనుంది. మరి ఆరంభంలో బోణీ కొట్టే జట్టేదో తెలియాలంటే మరికొన్ని గంటలు వేచి చూడక తప్పదు..!