దాదాపు నాలుగు వారాల తర్వాత ఇంటికి

ఓ వైపు కరోనా మహమ్మారి విజృంభణ, మరో వైపు ఆటగాళ్ళు క్రమంగా కరోనా బారిన పడడంతో ఈ ఏడాది ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్) వాయిదా పడిన సంగతి తెల్సిందే. అయితే ఐపీఎల్ వాయిదా నేపథ్యంలో ఇతర విదేశీ ఆటగాళ్ళు మూడు రోజుల్లోనే వారి స్వదేశాలకు చేరుకోగా… ఆసీస్ ఆటగాళ్ళు మాత్రం తమ దేశానికి చేరుకోవడానికి దాదాపు నాలుగు వారాల సమయం పట్టింది.

కాగా మే 4న ఐపీఎల్‌ను వాయిదా వేస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. అయితే అదే సమయంలో భారత్ లో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉండడంతో ఆస్ట్రేలియా భారత్ నుంచి ప్రయాణాలపై నిషేధం విధించింది. దీంతో ఆ దేశ ఆటగాళ్ళు నేరుగా స్వదేశానికి వెళ్ళడానికి నిబంధనలు అడ్డు వచ్చాయి. దీంతో వారు ముందుగా మాల్దీవులకు చేరుకొని 10 రోజులు క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. అనంతరం స్వదేశంలో 14 రోజులు సిడ్నీలో క్వారంటైన్‌లో ఉన్నారు. ఇక ఆదివారం క్వారంటైన్‌ గడువు పూర్తవ్వడంతో ఐపీఎల్‌ వాయిదా పడ్డ 27 రోజులకు వారు ఇళ్ళకు చేరుకున్నారు.

కాగా కుటుంబ సభ్యులను కలుసుకున్న వాటికి సంబంధించిన చిత్రాలను డేవిడ్‌ వార్నర్‌, స్టీవ్‌ స్మిత్‌, ప్యాట్‌ కమిన్స్‌ సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసారు. చాలా రోజుల తర్వాత కుటుంబ సభ్యులను కలవడం పట్ల వారు సంతోషం వ్యక్తం చేసారు. కాగా ఈ ఐపీఎల్‌ సీజన్ లో మిగిలిన మ్యాచ్ లు యూఏఈ వేదికగా సెప్టెంబర్లో లో జరగనున్న విషయం తెల్సిందే.