ఐపీఎల్ 16వ సీజన్ లో భాగంగా శనివారం రోజున హైదరాబాద్‌లోని ఉప్పల్‌లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. సన్‌రైజర్స్ ఇన్నింగ్స్ 19వ ఓవర్లో ప్రేక్షకుల అనుచిత ప్రవర్తనతో మ్యాచ్‌కు 6 నిమిషాల అంతరాయం కలిగింది. లాంగాన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న ప్రేరక్ మన్కడ్ తన తలకు ఏదో బలంగా తాకిందంటూ తమ డగౌట్‌కు సమాచారం ఇచ్చాడు. విషయం అంపైర్లకు చేరింది.
వాళ్లు మ్యాచ్ ఆపించి.. మైదానంలో వెతకగా నట్లు, బోల్ట్‌లు దొరికాయి. గ్యాలరీలో కూర్చున్న ప్రేక్షకులు కొందరు సీట్లకు ఉన్న నట్లు, బోల్టులను మైదానంలోకి విసిరినట్లు తేలింది. అవేష్ వేసిన ఆ ఓవర్లో ఫుల్‌టాస్ బంతిని ఫీల్డ్ అంపైర్ నోబ్‌గా ప్రకటించగా.. లఖ్‌నవూ అప్పీల్ చేసుకుంది. బంతి నడుము కంటే ఎత్తులో ఉన్నట్లు స్పష్టంగా కనిపించినా మూడో అంపైర్ వివాదాస్పద రీతిలో ఫీల్డ్ అంపైర్ నిర్ణయాన్ని తోసిపుచ్చాడు. ఆ తర్వాత ప్రేక్షకుల శ్రుతి మించి ప్రవర్తించారు. వారు లఖ్‌నవూ మెంటార్ గంభీర్‌ను లక్ష్యంగా చేసుకుని వస్తువులు మైదానంలోకి విసిరారని సమాచారం.