ఇవాళ్టి నుంచి ఈనెల 17 వరకు ఒడిశాలోని భువనేశ్వర్లో కేంద్ర పర్యాటక, సాంస్కృతికశాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జీ-20 కల్చర్ వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరగనున్నాయి. ఆ తర్వాత 22వ తేదీ నుంచి 24వ తేదీ వరకు కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో జీ-20 టూరిజం వర్కింగ్ గ్రూప్ సమావేశం జరగనుంది. దీనికి జీ-20లోని అమెరికా, రష్యా, చైనా, జర్మనీ, జపాన్ వంటి సభ్యదేశాలతో పాటు బంగ్లాదేశ్, సింగపూర్ తదితర తొమ్మిది అతిథిదేశాల ప్రతినిధులు సహా ఆహ్వానం పొందిన సంస్థలు, బృందాలు హాజరుకానున్నాయి.
శ్రీనగర్‌లో జరిగే ఫిల్మ్ టూరిజం సమావేశానికి ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందాన్ని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ఆహ్వానించారు. ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ అవార్డు వచ్చిన నేపథ్యంలో ఈ చిత్రబృందానికి ఆహ్వానం అందింది. దేశంలో సినిమా టూరిజాన్ని, షూటింగ్‌లను ప్రోత్సహించడం.. విదేశీ చిత్రాల షూటింగ్‌లు మన దేశంలో జరిగేలా చూడడం..విదేశీ పర్యాటకుల్ని ఆకర్షించడం లక్ష్యంగా కేంద్ర పర్యాటకశాఖ సమావేశాన్ని శ్రీనగర్‌లో నిర్వహిస్తోంది.