రోహిత్ శర్మ ఫిట్‌నెస్‌పై పాక్ మాజీ కెప్టెన్ కీలక వ్యాఖ్యలు

ఏ ఆటలోనైనా ముఖ్యమైనది ఫిట్‌నెస్. ఫిట్‌నెస్ లేకపోతే ఎన్ని మ్యాజిక్కులు తెలిసినా ఆ ఆటగాడు ఫెయిల్ అవ్వాల్సిందే. ముఖ్యంగా క్రికెట్‌లో ఫిట్‌నెస్ అత్యంత ప్రాధాన్యమైనది. ఓ ఆటగాడిని ఫిట్‌నెస్ ఎంత నైపుణ్యవంతుడిగా మారుస్తుందో.. ఫిట్‌గా లేకపోతే ఆటలో అంత దిగజారుస్తుంది కూడా. తాజాగా క్రికెటర్ల ఫిట్‌నెస్‌పై పాక్ మాజీ కెప్టెన్ సల్మాన్ భట్ మాట్లాడారు. ఆయన భారత స్టార్‌ బ్యాటర్లు కోహ్లీ.. రోహిత్‌ను పోల్చుతూ చెప్పాడు.

మైదానంలో పరుగుల సునామీ సృష్టించే హిట్‌మ్యాన్‌ రోహిత్ శర్మ ఓ చిన్న మార్పు చేసుకుంటే అతడిని ఎవరూ ఆపలేరని సల్మాన్ భట్ అన్నాడు. ప్రపంచ క్రికెట్‌లో ఏబీ డివిలియర్స్‌ స్థాయిని అందుకొంటాడని తెలిపాడు. సల్మాన్‌ భట్‌ తన యూట్యూబ్‌ ఛానల్‌లో ఈ వ్యాఖ్యలు చేశాడు.

‘‘”రోహిత్‌ను బాబర్‌, రిజ్వాన్‌తో పోల్చలేము. అతడికి ఉన్న నైపుణ్యానికి కోహ్లీలో సగం ఫిట్‌నెస్‌ సాధించినా.. ప్రపంచంలో అతడంత విధ్వంసకర ఆటగాడు మరొకడు ఉండడు. అతడి పోలిక కేవలం ఏబీ డివిలియర్స్‌తోనే ఉంటుంది. ఒక వేళ కోహ్లీ స్థాయిలో పూర్తి ఫిట్‌నెస్‌ సాధిస్తే.. అతడు ఏం చేస్తాడో అంచనాలకు అందదు.”’’ సల్మాన్‌ భట్‌, పాక్ మాజీ కెప్టెన్