తెలంగాణ రాజకీయాలు క్రమక్రమంగా మారిపోతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ బలహీనపడుతుండటంతో బీజేపీ ఆ స్థానాన్ని భర్తీ చేస్తూ ప్రజల్లోకి దూసుకుపోతోంది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్, తెరాస నాయకులు బీజేపీ, కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వంలో చేరకపోయినా తెరాస పార్టీ కేంద్రంలోని అధికార పార్టీతో దోస్తీ చేసింది. కానీ ఈ సారి కేసీఆర్.. జాతీయ పార్టీ పెడతారని నిర్ణయం తీసుకున్నారని టాక్.
అయితే… కెసిఆర్ జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టడం ఖాయమని తేలడంతో పార్టీ పేరుపై మరోసారి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ‘భారత రాష్ట్రీయ సమితి (BRS)’ అని పేరు పెడతారని ఇప్పటికే చేర్చ జరుగుతుండగా, మరో రెండు పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. ‘ఉజ్వల్ భారత్ పార్టీ (UBP), ‘నయా భారత్ పార్టీ (NBP)’ అనే పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. కొంతమంది టిఆర్ఎస్ నేతలు ఈ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. ఎక్కువ మంది నేతలు ఉజ్వల్ భారత్ పార్టీకి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. అయితే, దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.