ఆస్ట్రేలియాతో ఇటీవల అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ లో టీమిండియా దారుణంగా ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఆసీస్ చేతిలో 8 వికెట్ల తేడాతో భారత్ ఘోర పరాజయం పాలైంది. రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే టీమిండియా ఆలౌట్ అవగా ఆసీస్ సునాయాసంగా లక్ష్యాన్ని ఛేదించి మ్యాచ్ లో గెలుపొందింది.
అయితే అడిలైడ్ టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ వైఫల్యంపై మాజీ ప్లేయర్ సచిన్ టెండుల్కర్ స్పందించాడు. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ.. పృథ్వీ షా, మయాంక్ అగర్వాల్, హనుమ విహారి తప్ప కోహ్లి, పుజారా, రహానేలకు ఒత్తిడి ఉన్నప్పుడు ఎలా ఆడాలో తెలుసన్నాడు. అలాంటిది అంత దారుణంగా విఫలం చెందడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు.
ఇక ఆ టెస్టు మ్యాచ్‌లో భారత్‌కు లక్ కలసి రాలేదని సచిన్ వ్యాఖ్యానించాడు. ఆసీస్ మొదటి ఇన్నింగ్స్‌లో నిజానికి చాలా బంతులు ఎడ్జ్ తీసుకున్నా ఫీల్డర్ల చేతికి దొరకలేదన్నాడు. అదే భారత్ రెండో ఇన్నింగ్స్‌లో ఎడ్జ్ తీసుకున్న బంతులన్నీ ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లాయని, అందువల్ల భారత్ కు ఆ రోజు లక్ లేదని సచిన్ అన్నాడు. కాగా బార్డర్ గవాస్కర్ సిరీస్‌లో ప్రస్తుతం ఆసీస్ 1-0 తో లీడింగ్‌లో ఉండగా, రెండో టెస్టు ఈ నెల 26వ తేదీ నుంచి మెల్‌బోర్న్‌లో జరగనుంది. ఈ క్రమంలో టీమిండియా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నట్లు సమాచారం.