శ్రీలంకలో ఆసియా కప్‌ నిర్వహించలేకపోవడానికి కారణమదే: లంక బోర్డు కార్యదర్శి

-

రెండు రోజుల కిందట ఆసియా కప్‌ షెడ్యూల్‌ విడుదలైంది. ఆగస్టు 27 నుంచి సెప్టెంబరు 11 వరకు యూఏఈ వేదికగా ఈ టోర్నమెంట్ జరగనుంది. గతంలో నిర్ణయించిన ప్రకారం.. ఆసియాకప్‌నకు శ్రీలంక ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, అక్కడి ఆర్థిక, రాజకీయ సంక్షోభం కారణంగా వేదికను యూఏఈకి మారుస్తూ ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) నిర్ణయం తీసుకొంది.

దీనిపై శ్రీలంక క్రికెట్‌ బోర్డు (ఎస్‌ఎల్‌సీ) స్పందించింది. శ్రీలంకలో ఆసియా కప్‌ను నిర్వహించడానికి క్రికెట్ చైర్మన్ శ్రీ షమ్మీ సిల్వాతో సహా ఎగ్జిక్యూటివ్ కమిటీ అన్ని ప్రయత్నాలు చేసిందని ఎస్‌ఎల్‌సీ కార్యదర్శి మోహన్ డిసిల్వా తెలిపారు. లంకలో పరిస్థితులపై తప్పుడు ప్రచారం వల్లే ఆసియా కప్ యూఏఈకి తరలిపోయిందని పేర్కొన్నారు.

‘‘ఆసియాకప్‌ నిర్వహణకు శ్రీలంక పరిస్థితులు అనుకూలంగా లేవని సభ్యులు భావించారు. సభ్యదేశాల సహకారమే కాకుండా టోర్నమెంట్‌కు ప్రసారకర్తలు, స్పాన్సర్‌లు అవసరం. అయితే ప్రపంచవ్యాప్తంగా శ్రీలంకపై వచ్చిన తప్పుడు ప్రచారం వల్లే ఇలా జరిగింది. నెగిటివ్‌ పబ్లిసిటీకి ఇంధనం కోసం ప్రజలు బారులు తీరడం, ప్రజాందోళనలు తదితర అంశాలు దోహదపడ్డాయి. ఇక్కడే నిర్వహిస్తామని మేం ఎన్ని చెప్పినా ఆమోదం దక్కలేదు’’ అని మోహన్‌ తెలిపారు.

ఇతర దేశాల నుంచి లంకకు వచ్చేందుకు ప్రతినిధులు ఆసక్తి చూపకపోవడం కూడా కారణమని చెప్పాడు. టీ20 ఫార్మాట్‌లో జరిగే ఆసియాకప్‌ శ్రీలంక, అఫ్గానిస్థాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌తో ప్రారంభం కానుంది. ఆగస్ట్‌ 28న భారత్‌, పాక్‌ జట్లు తలపడనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news