అసలు ఈ ఏడాది ఐపిఎల్ 13 జరుగుతుందా లేదా అనే దానిపై స్పష్టత రావడం లేదు. దీనిపై భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ చైర్మన్ సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఐపిఎల్ నిర్వహణ పై సోమవారం స్పష్టత ఇస్తా అని గంగూలీ తాజాగా మీడియాకు వివరించాడు. శనివారం మీడియా అడిగిన ప్రశ్నకు గానూ ఆయన కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఏం జరుగుతుందో అంతా గమనిస్తున్నామన్నారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో మేం ఏం చెప్పలేమన్న గంగూలీ, అయినా, ఇప్పుడు చెప్పడానికి ఏముంది? అని ప్రశ్నించారు. విమానాశ్రయాలు మూతపడ్డాయని… ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు, కార్యాలయాలు లాక్‌డౌన్‌లో ఉన్నాయని పేర్కొన్నాడు. ఎవరూ ఇంటి నుంచి బయటకు వెళ్లలేరని వ్యాఖ్యానించాడు. ఈ పరిస్థితి మే మధ్య వరకూ ఉంటుందనిపిస్తోందని అభిప్రాయపడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఆటగాళ్లను ఎక్కడి నుంచి తీసుకొస్తారని ఫైర్ అయ్యాడు.
ఐపీఎల్‌ను పక్కన పెట్టండని మీడియా పై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసాడు. కాస్త ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే.. ప్రపంచంలో ఎక్కడా ఏ క్రీడలు నిర్వహించడానికి కూడా అవకాశం లేదని మండిపడ్డాడు. బోర్డ్ అధికారులతో చర్చించి సోమవారం అప్‌డేట్ ఇస్తా అని మీడియాకు వివరించారు. అసలు నిజం చెప్పాలి అంటే ప్రపంచ వ్యాప్తంగా జనజీవనం స్తంభించిన తర్వాత క్రీడలకు భవిష్యత్తు ఉందా అని ఆయన నిలదీశారు.