14000వేల పరుగుల మైలురాయిని అందుకున్న గేల్

క్రికెట్ గురించి తెలిసిన వాళ్లకు వెస్టిండీస్ క్రికెటర్ క్రిస్ గేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అభిమానులు ముద్దుగా ఈ జులపాల జుట్టు వీరుడ్ని యూనివర్స్ బాస్ అని పిలుస్తుంటారు. గేల్ సునామీ కూడా అలాగే ఉంటుంది మరి. ప్రపంచంలో ఎవరికీ సాధ్యం కాని ఆటతీరుతో ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తుంటాడు. ప్రస్తుతం ఆస్ర్టేలియా తో జరుగుతున్న టీ20ల్లో సత్తా చాటుతూ… దూసుకుపోతున్నాడు. తొలి రెండు టీ20ల్లో అంతగా ఆకట్టుకోని ఈ ఆటగాడు మూడో టీ20లో మాత్రం ఇరగదీశాడు. అర్థసెంచరీ చేయడంతో పాటు మరెవరికీ సాధ్యం కాని ఫీట్ ను కూడా సాధించి ఔరా! అని అనిపించుకున్నాడు. అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో 14 వేల పరుగుల మైలురాయిని అందుకున్న తొలి క్రికెటర్ గా రికార్డు నమోదు చేశాడు.
41 సంవత్సరాలు ఉన్న ఈ వెటరన్ ఆటగాడు వయస్సు మీద పడుతున్నా కొద్ది మరిన్ని రికార్డులను అవలీలగా నెలకొల్పుతున్నాడు. టీ20ల్లో గేల్ ను ఎవరూ బీట్ చేయలేరనే విషయం అభిమానులందరికీ తెలుసు. ప్రపంచవ్యాప్తంగా ఉండే లీగ్ లలో ఆడుతూ… దుమ్మురేపే యూనివర్స్ బాస్ 14,000 పరుగులు నమోదు చేసిన మొదటి బ్యాట్స్ మన్ గా రికార్డులకెక్కాడు. మొదటి రెండు మ్యాచుల్లో పూర్తిగా నిరాశపరిచాడు. కేవలం 4, 13 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. కానీ మూడో టీ20లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ… అర్థ సెంచరీ సాధించాడు.

గేల్ /gayle
గేల్ /gayle

మూడో టీ20లో యూనివర్స్ బాస్ గేల్ ఆస్ర్టేలియా బౌలర్లను ఊచకోత కోశాడు. స్పిన్నర్లు, సీమర్లు అనే తేడా లేకుండా అందరినీ ఉతికారేశాడు. అర్థసెంచరీ పూర్తి చేసుకుని భయంకరంగా మారుతున్న గేల్ చివరికి 67 పరుగుల వద్ద మెరిడిత్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. గేల్ తన సహచర ఆటగాళ్లకు ఈ ఫార్మాట్ లో అందనంత దూరంలో ఉన్నాడు. మరో వెస్టిండీస్ ఆటగాడు కీరన్ పొలార్డ్ 10896 పరుగులు, ఆస్ట్రేలియాకు చెందిన డేవిడ్ వార్నర్ 10017 పరుగులు, భారత్ కు చెందిన విరాట్ కోహ్లీ 9992 పరుగులు సాధించి గేల్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. ఈ మ్యాచ్ కు ముందు గేల్ 13971 పరుగులతో ఉండేవాడు. కాగా గేల్ టీ20ల్లో 22 సెంచరీలు, 86 అర్థ సెంచరీలు సాధించాడు. ఇక గేల్ టీ20ల్లో దాదాపు వెయ్యికి పైగా ఫోర్లు, సిక్సులు బాదాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో కూడా గేల్ మెరుపులు మనం చూస్తుంటాం.