ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానాల్లో కొనసాగుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు.
ఐపీఎల్ 12వ సీజన్ ఎంతో ఉత్సాహంగా ఇటీవలే ముగిసింది. దేశ విదేశాలకు చెందిన క్రికెటర్లు ఆయా ఐపీఎల్ టీంలలో ఆడుతూ క్రికెట్ అభిమానులకు ఎంతగానో వినోదాన్ని పంచారు. ఈ క్రమంలోనే ఐపీఎల్ ముగియగానే ఏ దేశ ఆటగాళ్లు ఆ దేశ జట్లతో చేరిపోయారు. మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019 కోసం ఆయా దేశాల జట్ల సభ్యులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఆ దేశాలు వరల్డ్ కప్ ఆడే తమ తమ టీంలకు చెందిన ప్లేయర్లను ప్రకటించగా.. భారత్ కూడా గతంలో వరల్డ్ కప్ ఆడే ప్లేయర్ల వివరాలను ప్రకటించింది. అయితే ఆ ప్లేయర్లు ఐపీఎల్‌లో ఎలాంటి ప్రదర్శన చేశారో, అసలు వారు వరల్డ్ కప్‌లో భారత్‌కు విజయాన్ని అందిస్తారో, లేదో.. ఇప్పుడు తెలుసుకుందాం.
విరాట్‌కోహ్లి…
టీమిండియా క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి ఐపీఎల్‌లో తన టీం బెంగుళూరుకు కేవలం 5 మ్యాచుల్లో మాత్రమే విజయాలను అందించాడు. రాయల్ చాలెంజర్స్ కెప్టెన్‌గా ఉన్నప్పటికీ కోహ్లి సారథ్యంలో బెంగళూరు ఈ ఐపీఎల్‌లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో ఈ ఐపీఎల్ సీజన్‌లో 14 మ్యాచ్‌లు ఆడిన కోహ్లి 33.14 సగటుతో ఓవరాల్‌గా 464 పరుగులు చేశాడు. వాటిల్లో 2 అర్థ సెంచరీలు, 1 సెంచరీ ఉన్నాయి. అయినప్పటికీ కోహ్లి ఈసారి ఐపీఎల్‌లో తన స్థాయికి తగిన ప్రదర్శన ఇవ్వలేకపోయాడు. దీంతో అతనిపై కొంత ఒత్తిడి ఉందనే చెప్పవచ్చు. మరి కోహ్లి వరల్డ్‌కప్‌లో సారథిగా ఎలా రాణిస్తాడో, ప్లేయర్‌గా ఎలా ఆడుతాడో వేచి చూస్తే తెలుస్తుంది.
రోహిత్ శర్మ…
ముంబై ఇండియన్స్ జట్టుకు రోహిత్ శర్మ 4వ సారి టైటిల్‌ను అందించి రికార్డు సృష్టించాడు. అయితే కెప్టెన్‌గా సక్సెస్ అయినప్పటికీ రోహిత్ శర్మ బ్యాట్స్‌మెన్‌గా మాత్రం అంతగా విజయం సాధించలేదనే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ సారి ఐపీఎల్‌లో రోహిత్ శర్మ 15 మ్యాచులు ఆడి 28.92 సగటుతో కేవలం 405 పరుగులు మాత్రమే చేశాడు. మరి రోహిత్ వరల్డ్ కప్‌లో అయినా తన బ్యాట్ ఝులిపిస్తాడా, లేదా అనేది చూడాలి.
కేఎల్ రాహుల్…
ఈ ఐపీఎల్ సీజన్‌లో కేఎల్ రాహుల్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. పంజాబ్ జట్టు తరఫున ఆడిన రాహుల్ 14 మ్యాచుల్లో 6 అర్థ సెంచరీలు, 1 సెంచరీ చేసి మొత్తం 593 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ వరల్డ్ కప్‌లో తుది జట్టులో కచ్చితంగా ఆడే అవకాశం కనిపిస్తోంది. ఇక ఐపీఎల్ లో రెచ్చిపోయినట్లుగానే వరల్డ్ కప్‌లోనూ రాహుల్ ఆడితే భారత్ సునాయాసంగా విజయాలు సాధిస్తుందని ఇట్టే చెప్పవచ్చు.
శిఖర్ ధావన్…
మొదట్లో సన్‌రైజర్స్ జట్టుకు ఆడిన ధావన్ ఈ సారి ఢిల్లీ తరఫున ఆడాడు. ఈ ఐపీఎల్ సీజన్‌లో ధావన్ మొత్తం 16 మ్యాచుల్లో 5 అర్థ సెంచరీలు చేసి 521 పరుగులు సాధించి ఫరవాలేదనిపించాడు. అయితే వరల్డ్ కప్‌లో ధావన్‌కు తోడుగా రోహిత్ ఇన్నింగ్స్‌ను ఆరంభిస్తే ప్రత్యర్థి జట్లకు ముచ్చెమటలు పడతాయనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి వీరిద్దరూ వరల్డ్ కప్‌లో ఎలా విజృంభిస్తారో చూడాలి.
ధోనీ…
టీమిండియా క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఈ ఐపీఎల్ సీజన్‌లో మొత్తం 15 మ్యాచులు ఆడి 416 పరుగులు చేశాడు. ఈ వయస్సులోనూ తనలో ఇంకా సత్తా లేదని నిరూపించుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో ఇతర ప్లేయర్ల పరంగా చూస్తే ధోనీ చేసిన పరుగులు తక్కువే. కానీ అతను చాలా మ్యాచులలో బెస్ట్ ఫినిషర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాగే కీలక సమయాల్లో జట్టును అన్ని విధాలుగా ఆదుకోవడంలో, బ్యాట్స్‌మెన్ గా లక్ష్యాన్ని ఛేధించడంలో, ప్రత్యర్థి జట్ల ప్లేయర్లకు వ్యూహాలను పన్నడంలో ధోనీని మించిన వారు ఎవరూ లేరనే చెప్పవచ్చు. ఈ క్రమంలో కెప్టెన్ కోహ్లి ఈ సారి వరల్డ్ కప్‌లో ధోనీ సలహాలను ఎక్కువగా తీసుకునే అవకాశం ఉంది. వీరిద్దరూ తమ వ్యూహాలకు పదును పెట్టి ప్రత్యర్థి జట్టు ప్లేయర్లను తిప్పలు పెడితే.. భారత్‌కు సునాయాసంగా విజయాలు లభిస్తాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు.
కేదార్ జాదవ్…
కేదార్ జాదవ్‌కు మంచి ఆల్‌రౌండర్ అని పేరుంది. గతంలో టీమిండియా తరఫున ఆడిన పలు మ్యాచుల్లో జాదవ్ చక్కని ప్రదర్శన కనబరిచాడు. కానీ ఈ ఐపీఎల్ సీజన్‌లో అంతగా ఆకట్టుకోలేకపోయాడు. 14 మ్యాచులు ఆడిన జాదవ్ కేవలం 162 పరుగులే సాధించాడు. అటు వికెట్లు తీయడంలోనూ జాదవ్ పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో జాదవ్ గాయం కారణంగా ఐపీఎల్ ప్లే ఆఫ్స్ కూడా ఆడలేదు. అయితే జాదవ్ వరల్డ్ కప్‌లో ఆడేది లేనిది ఇంకా తేలలేదు. ఒక వేళ ఆడితే మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది.
దినేశ్ కార్తీక్…
దినేశ్ కార్తీక్ కోల్‌కతా నైట్ రైడర్స్ కెప్టెన్ గా 14 మ్యాచ్‌లలో 253 పరుగులు చేశాడు. అందులో 2 అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ క్రమంలో బ్యాట్స్‌మన్‌గా కార్తీక్ అంత మెరుగైన ప్రదర్శన చేయలేదనే చెప్పాలి. కానీ టీమిండియాలో గతంలో ఆడిన కార్తీక్ కీలక మ్యాచులలో భారత్‌ను అనేక సార్లు గెలిపించాడు. ఈ క్రమంలో ఈసారి కూడా వరల్డ్ కప్‌లో అలా జట్టును ఆదుకుంటే.. భారత్ తన విజయాల పరంపర కొనసాగించే అవకాశం ఉంది.
విజయ్ శంకర్…
చాలా తక్కువ సమయంలోనే ఇండియన్ క్రికెట్ టీంలో చోటు సాధించుకున్న అత్యంత లక్కీ ప్లేయర్లలో విజయ్ శంకర్ ఒకడు. ఆల్ రౌండర్ గా శంకర్ జట్టులో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే ఐపీఎల్‌లో మాత్రం ఇతను అంతగా రాణించలేదు. 15 మ్యాచులు ఆడిన శంకర్ 20.33 సగటుతో కేవలం 244 పరుగులు మాత్రమే చేశాడు. ఇక వికెట్లు తీయడంలోనూ ఇతని ప్రదర్శన మెరుగ్గా లేదు. మరి వరల్డ్ కప్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి.
హార్దిక్ పాండ్యా…
ఇండియన్ ఆల్ రౌండ్ క్రికెటర్లలో హార్దిక్ పాండ్యా స్టైలే వేరు. గతంలో టీమిండియా తరఫున ఆడిన అతను ఎన్నో మ్యాచుల్లో జట్టును గెలిపించాడు. అలాగే ఈ సారి ఐపీఎల్‌లోనూ మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సారి ఐపీఎల్‌లో 16 మ్యాచులు ఆడిన పాండ్యా 44.86 సగటుతో ఏకంగా 402 పరుగులు చేశాడు. అలాగే చక్కని బౌలింగ్‌తో 14 వికెట్లు కూడా తీశాడు. ఈ క్రమంలో పాండ్యా వరల్డ్ కప్‌లో ఆడే భారత జట్టు 11 మంది సభ్యుల్లో కచ్చితంగా ఉంటాడని చెప్పవచ్చు. అయితే ఐపీఎల్‌లో మాదిరిగానే వరల్డ్ కప్‌లోనూ పాండ్యా విజృంభిస్తే.. భారత్ కచ్చితంగా విజయాలు సాధిస్తుందని చెప్పవచ్చు.
రవీంద్ర జడేజా…
ఇండియన్ క్రికెట్ టీంలోని అత్యంత సీనియర్ ఆల్‌రౌండర్లలో రవీంద్ర జడేజా ఒకడు. ఈ సారి ఐపీఎల్ సీజన్‌లో జడేజా ప్రదర్శన యావరేజ్ గానే ఉంది. బౌలింగ్‌లో 15 వికెట్లు తీయగా, బ్యాటింగ్‌లో ఓవరాల్ గా 106 పరుగులు మాత్రమే చేశాడు. అయితే జట్టు ఆపదలో ఉన్నప్పుడు లేదా కీలక సమయాల్లో వికెట్లు అవసరం ఉన్నప్పుడు ఆదుకునే జడేజా వరల్డ్ కప్‌లో తన స్థాయికి తగినట్లు ప్రదర్శన ఇస్తే.. టీమిండియా విజయాలు సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
మహ్మద్ షమీ…
ఐపీఎల్‌లో పంజాబ్ జట్టు తరఫున ఆడిన స్టార్ బౌలర్ షమీ 14 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి సత్తా చాటాడు. ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మన్‌కు పరుగులు ఇవ్వకుండా తిప్పలు పెట్టే షమీ వరల్డ్ కప్‌లో ఇదే ఆట తీరును కొనసాగిస్తే.. టీమిండియా కచ్చితంగా గెలుస్తుంది.
యజ్వేంద్ర చాహల్…
చాహల్ ఐపీఎల్‌లో ఈ సారి 14 మ్యాచ్‌లు ఆడి 18 వికెట్లు తీసి ఫర్వాలేదనిపించాడు. స్పిన్ విభాగంలో చాహల్ కీలకపాత్ర పోషిస్తే.. వరల్డ్ కప్‌లో భారత్ సునాయాసంగా విజయాలు సాధిస్తుందని చెప్పవచ్చు.
భువనేశ్వర్ కుమార్…
సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఆడిన భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్‌లో పలు మ్యాచులకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. ఈ క్రమంలో ఓవరాల్‌గా 15 మ్యాచుల్లో భువీ కేవలం 13 వికెట్లు మాత్రమే తీశాడు. అయితే పేస్ బౌలింగ్‌కు అనుకూలించే ఇంగ్లండ్ పిచ్‌లపై భువనేశ్వర్ కుమార్ రాణిస్తాడనే నమ్మకం ఉంది. భువీ వికెట్లు తీస్తే టీమిండియాకు మ్యాచ్‌లలో విజయం సాధించడం నల్లేరు మీద నడకే అవుతుందని సులభంగా చెప్పవచ్చు.
జస్ప్రిత్ బుమ్రా…
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ స్థానాల్లో కొనసాగుతున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరఫున ఆడి ఈ సీజన్‌లో 16 మ్యాచ్‌లలో 19 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. పరుగులను పొదుపుగా ఇవ్వడంలోనూ బుమ్రా పేరుగాంచాడు. వరల్డ్ కప్‌లోనూ బుమ్రా ఇదే ప్రదర్శన కొనసాగించాలని అభిమానులు ఆశిస్తున్నారు.
కుల్దీప్ యాదవ్…
తన స్పిన్ మాయాజాలంతో ప్రత్యర్థి జట్లకు చెందిన బ్యాట్స్‌మెన్‌ను ముప్పు తిప్పలు పెట్టే టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఈ సీజన్‌లో 9 మ్యాచులు ఆడి కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. ఈ క్రమంలో కుల్దీప్ ప్రదర్శన టీమిండియాను కలవరపెడుతోంది. వరల్డ్ కప్‌లో చాహల్‌తో కలసి స్పిన్ భారాన్ని మోస్తాడా, లేదా అనేది వేచి చూస్తే తెలుస్తుంది.