భారత్, దక్షిణాఫ్రికా మధ్య పుణె వేదికగా జరుగుతున్న రెండో టెస్టు మ్యాచ్‌లో మూడోరోజు టీమిండియా మెరుగైన స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌ను 601/5 వద్ద డిక్లేర్ చేసిన కోహ్లి సేన ప్రత్యర్థిని 275 పరుగులకు ఆలౌట్ చేసింది. 36/3 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన సఫారీ జట్టును భారత బౌలర్లు కుదురుకోనివ్వలేదు. ఇక కెప్టెన్ డుప్లెసిస్ (64), డికాక్ (31), బ్రూయెన్ (30) మినహా మిగతా అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు.
అయితే, 162 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిన సఫారీ జట్టును టెయిలెండర్లు కేశవ్ మహరాజ్, ఫిలాండర్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కేశవ్ మహరాజ్ (132 బంతుల్లో 72; 12 ఫోర్లు), ఫిలాండర్ (164 బంతుల్లో 44 నాటౌట్; 5 ఫోర్లు) పోరాటంతో సఫారీ జట్టు ఈ మాత్రమైనా స్కోరు సాధించగలిగింది. అశ్విన్ నాలుగు, ఉమేష్ యాదవ్ మూడు, మహ్మద్ షమీ రెండు, జడేజా ఒక వికెట్ దక్కించుకున్నారు. ఇంకా రెండు రోజులు ఆట మిగిలి ఉంది.