జాతీయ క్రీడల్లో తెలుగు క్రీడాకారులు జోరు కొనసాగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఈ క్రీడల్లో పతకాల పంట పండిస్తున్నారు. సోమవారం రోజున తెలంగాణ మూడు స్వర్ణాలు, ఒక రజతం, మరో కాంస్యం సొంతం చేసుకోగా.. ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు రెండు రజతాలు, మూడు కాంస్యాలు దక్కాయి.
బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో తెలంగాణ జట్టు స్వర్ణ పతకం సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన ఫైనల్లో తెలంగాణ 3-0తో కేరళపై విజయం సాధించింది. మిక్స్‌డ్ డబుల్స్‌లో సుమీత్‌రెడ్డి- సిక్కిరెడ్డి జోడీ 21-15, 14-21, 21-14తో అర్జున్- ట్రీసా జాలీ జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్‌లో భమిడిపాటి సాయిప్రణీత్ 18-21, 21-16, 22-20తో హెచ్.ఎస్.ప్రణయ్‌పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో సామియా ఇమాద్ ఫారూఖీ 21-5, 21-12తో గౌరీకృష్ణపై గెలిచి తెలంగాణ జట్టుకు విజయాన్ని అందించింది.
మహిళల ఆర్టిస్టిక్ సింగిల్ ఫ్రీ స్కేటింగ్‌లో తెలంగాణ అమ్మాయి రియా సాబూ స్వర్ణంతో మెరిసింది. 112.4 పాయింట్లతో రియా ప్రథమ స్థానం సాధించింది. ఇదే విభాగంలో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు కుల సాయి సంహిత (107) రజతం, భూపతిరాజు అన్మిష (97.8) కాంస్య పతకాలు గెలుచుకున్నారు. స్విమ్మింగ్‌లో వ్రితి అగర్వాల్ రజతం సాధించింది. 800 మీటర్ల ఫ్రీస్టైల్‌లో వ్రితి (9 నిమిషాల 23.91 సెకన్లు) ద్వితీయ స్థానంలో నిలిచింది.
రోయింగ్‌లో తెలంగాణ పురుషుల జట్టు కాంస్యం సాధించింది. 8 ప్లస్ కాక్స్‌విన్‌లో బాలకృష్ణ, నితిన్ కృష్ణ, సాయిరాజు, చరణ్‌సింగ్, మహేశ్వర్‌రెడ్డి, గజేంద్రయాదవ్, నవదీప్, హర్‌ప్రీత్‌సింగ్, శ్రీకాంత్ (కాక్స్)లతో కూడిన తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.