ఇండియా, పాకిస్థాన్ దేశాలు 1987లో వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా విజయం సాధించింది.
మరికొద్ది రోజుల్లో జరగనున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ కోసం క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సారి భారత్ కప్పు సాధిస్తుందా, లేదా అని ఇప్పటికే అభిమానులు బెట్టింగ్‌లు కాస్తున్నారు. మరోవైపు క్రికెట్ విశ్లేషకులు మాత్రం ఈ సారి ఏ ప్లేయర్ ఎలా ఆడుతాడు.. అంటూ వివరణలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ప్లేయర్లు నెట్లలో తీవ్రంగా శ్రమిస్తూ కప్ సాధించాలనే ఉత్సాహంలో ఉన్నారు. అయితే అసలు ఇప్పటి వరకు క్రికెట్ వరల్డ్ కప్‌లు ఎన్ని జరిగాయి, అసలు క్రికెట్‌లో మొదటి వరల్డ్ కప్ ఎక్కడ జరిగింది ? ఇప్పటి వరకు ఏయే దేశాలు ఈ కప్‌ను గెలుచుకున్నాయి ? తదితర వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
1. మొదటి క్రికెట్ వరల్డ్ కప్‌ను 1975లో నిర్వహించగా ఇంగ్లండ్ దేశం ఆతిథ్యం ఇచ్చింది. అక్కడి లార్డ్స్ గ్రౌండ్‌లో వెస్టిండీస్, ఆస్ట్రేలియాలు ఫైనల్ మ్యాచ్‌లో ఆడగా వెస్టిండీస్ కప్‌ను ఎగరేసుకుపోయింది.
2. రెండో క్రికెట్ వరల్డ్ కప్‌ను 1979వ సంవత్సరంలో ఇంగ్లండ్‌లోనే నిర్వహించారు. లార్డ్స్ మైదానంలో ఫైనల్ మ్యాచ్ జరిగింది. వెస్టిండీస్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌లో ఆడాయి. వెస్టిండీస్ మళ్లీ కప్ గెలుచుకుంది.
3. ఇక 1983లో మూడోసారి క్రికెట్ వరల్డ్ కప్ నిర్వహించారు. అప్పుడు కూడా ఇంగ్లండ్ దేశమే వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. లార్డ్స్ మైదానంలో ఇండియా, వెస్టిండీస్ జట్లు ఫైనల్ ఆడగా ఇండియా కప్‌ను సాధించింది.
4. ఇండియా, పాకిస్థాన్ దేశాలు 1987లో వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా విజయం సాధించింది.
5. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు 1992 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో పాకిస్థాన్, ఇంగ్లండ్ జట్లు ఫైనల్‌లో ఆడగా, పాకిస్థాన్ జట్టు కప్‌ను సాధించింది.
6. ఇండియా, పాకిస్థాన్, శ్రీలంక దేశాలు 1996 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. పాకిస్థాన్‌లోని లాహోర్ గడాఫీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ నిర్వహించగా, అందులో శ్రీలంక, ఆస్ట్రేలియా జట్లు తలపడ్డాయి. శ్రీలంక విజయం సాధించి కప్‌ను ఎగరేసుకు పోయింది.
7. ఇంగ్లండ్ దేశం 1999 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇచ్చింది. లార్డ్స్ మైదానంలో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ జట్లు ఫైనల్ మ్యాచ్ ఆడగా, ఆస్ట్రేలియా విజయం సాధించి కప్ తీసుకుంది.
8. దక్షిణాఫ్రికా, కెన్యా, జింబాబ్వే దేశాలు 2003 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. జోహన్నస్ బర్గ్‌లోని వాండరర్స్ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగ్గా ఆస్ట్రేలియా, ఇండియా జట్లు తలపడ్డాయి. ఆస్ట్రేలియా కప్ సాధించింది.
9. వెస్టిండీస్ దేశం 2007 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. కెన్సింగ్టన్ ఓవల్ మైదానంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా, శ్రీలంక జట్లు తలపడగా, ఆస్ట్రేలియా కప్ సాధించింది.
10. ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంకలు 2011 ప్రపంచ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత్, శ్రీలంక జట్లు తలపడగా భారత్ కప్ సాధించింది.
11. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు 2015 వరల్డ్ కప్‌కు ఆతిథ్యం ఇచ్చాయి. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆస్ట్రేలియా విజయం సాధించింది.
మరిక ఈసారి ఇంగ్లండ్‌లో జరగనున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ 2019లో ఫైనల్‌లో ఏయే జట్లు తలపడతాయో, ఏ జట్టు కప్‌ను ఎగరేసుకుపోతుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!