తెలంగాణలో మరో ఎమ్మెల్యేకి కరోనా పాజిటివ్

తెలంగాణాలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే కరోన ఉదృతి కాస్త తక్కువగానే ఉన్నా, ఇక్కడ తక్కువ అని చెప్పలేము. ఇక్కడ సామాన్య ప్రజలతో పాటు సెలబ్రిటీలు, నేతలు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది నేతలు కరోన బారిన పడగా దాని నుండి కోలుకున్నారు. తాజాగా తెలంగాణాకు చెందిన మరో శాశన సభ్యుడు కరోనా బారిన పడ్డారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గం ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు తనకు కరోనా ఉందని, హోమ్ క్వారంటైన్ లో ఉన్నానని ప్రకటించారు.

‘ప్రియమైన శ్రేయోభిలాషులకు అందరికీ నమస్కారం, నేను,నా భద్రతా సిబ్బంది శ్రీనివాస్ COVID-19 పాజిటివ్ గా నిర్ధారించబడ్డాము, మేము ఆరోగ్యంతో బాగానే ఉన్నాము, ప్రస్తుతం క్వారంటైన్ లో ఉన్నాము, నాతో ఈమధ్యలో కలసిన వారు అందరు దయచేసి విధిగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాను, అలానే నా శ్రేయోభిలాషులందరు ఆందోళన చెందవద్దని కోరుచున్నాను’ అని ఆయన తన ఫేస్ బుక్ లో ప్రకటించారు.