ఆర్థిక, ఆహార సంక్షోభంతో శ్రీలంక దేశం కొట్టుమిట్టాడుతోంది. ఆదేశంలో తినడానికి తిండి కూడా దొరకడం లేదు. నిత్యావసరాలు కొనుక్కుందాం అనుకున్నా ప్రజల వద్ద డబ్బులు లేని పరిస్థితి ఏర్పడింది. నిత్యావసరాల ధరలు చుక్కలను అంటుతున్నాయి. దీంతో దేశ ప్రజల్లో తీవ్ర అసహనం ఏర్పడింది. అధ్యక్షుడు గోటబయ రాజపక్సే ప్రభుత్వానికి వ్యతిరేఖంగా ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసన, ఆందోళనలు చేస్తున్నారు.
తాజాగా శ్రీలంక కీలక ప్రకటన చేసింది. ఆదేశ ఖజానా దివాళా తీసినట్లు ప్రకటించింది. విదేశీ అప్పులు తీర్చే పరిస్థితుల్లో లేనట్టు వెల్లడించింది. శ్రీలంకకు దాదాపు 51 బిలియన్ డాలర్ల అప్పు ఉండగా… ఈ అప్పును తీర్చలేమని శ్రీలంక ప్రభుత్వం ప్రకటించింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు ఐఎంఎఫ్ ను ఆశ్రయించింది. ఐఎంఎఫ్ ఉద్దీపన ప్యాకేజీలను అందించాలని కోరింది. ప్రస్తుతం శ్రీలంక ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకున్నా దానికి చెల్లించడానికి దేశ ఖజానాలో డాలర్లు అయిపోయాయి. దీంతో ఇతర దేశాల సాయం కోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే తమను ఆదుకోవాలని భారత్, చైనాలతో పాటు ఇతర దేశాలను కోరుతోంది. ఇప్పటికే భారత్ శ్రీలంకకు డిజిల్, బియ్యాన్ని పంపిణీ చేసింది. తాజాగా 11,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సరఫరా చేసింది. బియ్యంతో వెళ్లిన చెన్ గ్లోరి నౌక కొలంబో చేరుకుంది.