ఆ పుస్తకం ఇస్తే…పూర్తి వివరాలు చెబుతా..
వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తాను ఎందుకు దాడి చేశానో అనే విషయాన్ని ప్రజలతో మాట్లాడే అవకాశం ఇస్తే పూర్తిగా వివరిస్తానని నిందితుడు శ్రీనివాస రావు తెలిపారు. ఎన్ఐఏ (జాతీయ దర్యాఫ్తు సంస్థ) పోలీసులు శుక్రవారంతో శ్రీనివాస్ కస్టడీ ముగియనున్న సందర్భంగా ఆయన్ని నేడు న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. విజయవాడ జైల్లో శ్రీనివాస రావుకు భద్రత లేదని, ప్రాణహానీ ఉందని అతని తరఫు లాయర్ కోర్టుకు వివరించడంతో పరిస్థితులను గమనించిన న్యాయస్థానం నిందితుడు శ్రీనివాస రావును ప్రత్యేక భద్రత మధ్య రాజమండ్రి జైలుకు తరలించాలని ఎన్ఐఏ కోర్టు ఆదేశించింది. దీంతో 25వ తేదీ వరకు రిమాండ్ విధించింది. కోర్టులో న్యాయమూర్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ… తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు… ప్రజలతో మాట్లాడే అవకాశం కల్పిస్తే అన్ని విషయాలు చెబుతా అన్నారు. అలాగే, అసలు జగన్ పైన దాడి చేశానో పూర్తిగా వివరిస్తా అంటూ శ్రీనివాస్ పేర్కొన్నారు.
ఎలాంటి రాజకీయ ప్రమేయం లేని కోడి కత్తి దాడిని అనవసరంగా రాజకీయ చేస్తున్నారన్నారు. జైల్లో తాను రాసిన పుస్తకాన్ని తనకు ఇప్పించాలని నిందితుడు కోర్టును కోరారు. ఇప్పటికే తాను జగన్ పైన ఎందుకు దాడి చేయవలసి వచ్చిందో అనే విషయాన్ని పుస్తక రూపంలో 22 పేజీల వరకు పూర్తి చేశాను..దాన్ని సబ్ జైలర్ లాక్కోవడం ఎంతో బాధించిందని న్యాయస్థానానికి తెలిపారు. పుస్తకం ఇప్పిస్తే ప్రజా కోర్టులోనే తాను వాస్తవాలు వెల్లడిస్తానని చెప్పడం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది.