అవును వాళ్లిద్దరూ ఒకే దారిలో వెళ్తూ
వెళ్తూ గవర్నర్ వ్యవస్థను సంబంధిత
అధికారాలనూ ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తూ
వివాదాలను గోరంతను కాస్త
కొండంత చేస్తూ ఉన్నారు..
ఆ ఇద్దరే కేసీఆర్ మరియు స్టాలిన్
విప్లవాత్మక మార్పులకే కాదు
వినూత్న పద్ధతులకూ నాంది పలికిన
తమిళ సీఎం మాత్రం కొన్నింట కేసీఆర్ ను ఫాలో కావడం విశేషం
గవర్నర్ వ్యవస్థను వ్యతిరేకిస్తూ కేసీఆర్ పెద్ద రాద్ధాంతమే చేస్తున్నారు.ఆ విధంగా ఆయన వెనక్కు తగ్గడం లేదు. తమిళ సై తో ఇప్పటికే ఆయనకు ఉన్న విభేదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. అంతేకాదు ఓ సందర్భంలో ప్రభుత్వ పెద్ద తీరు కారణంగా ఆమె కన్నీటి పర్యంతం అయి మోడీ దగ్గర పంచాయతీ కూడా పెట్టారు. కానీ ఆయన కూడా ఈ సమస్యను ఎందుకనో పెద్దగా పరిష్కరించలేకపోయారు. నేడో రేపో తమిళ సై ను మార్చే ఉద్దేశంలో మోడీ ఉన్నారు అని తెలుస్తోంది. ఇక కేంద్రంతో తగువుకు సై అంటున్న డీఎంకే బాస్, తమిళ సీఎం స్టాలిన్ కూడా ఇదే విధంగా ఉన్నారు. ఆయనకు సోనియా ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. దక్షిణాదిన సోనియా ఆశీస్సులే కాదు ఆర్థిక అండదండలు పుష్కలంగా ఉన్న ఏకైక వ్యక్తి స్టాలిన్ మాత్రమే ! అందుకనో , ఎందుకనో ఆయన కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు నియమిత గవర్నర్ ను వ్యతిరేకించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుండడం గమనార్హం. ఈ విషయమై ఇప్పటికే కొన్ని నిర్ణయాలు సైతం అమలు పరిచారు. ఆ వివరం ఈ కథనంలో..
ప్రస్తుతం ఆంధ్రాలో తప్పితే తెలంగాణ మరియు తమిళ నాడు ఒకే బాటలో వెళ్తున్నాయి. అవి రెండూ కేంద్రంతో తగాదాను పెంచుకునేందుకే ఎక్కువ ఉత్సాహాన్ని చూపిస్తున్నాయి. స్టాలిన్ కు కాంగ్రెస్ కు ఉన్న స్నేహ గంధం కారణంగానే తమిళ నాట
కొన్ని పరిణామాల్లో మార్పులు వస్తున్నాయి. అవి ఏకంగా రాజ్యాంగ స్ఫూర్తికి సంబంధించిన అవి ఉండడం ఓ ప్రధాన సమస్య. ఇదే విధంగా తెలంగాణలో కూడా పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇక్కడ కూడా గవర్నర్ వ్యవస్థ అస్సలు వద్దేవద్దని అంటున్నారు కేసీఆర్. అందుకే ఆయన ఎప్పటి నుంచో బీజేపీ నియమిత గవర్నర్ తమిళ సై తో తగువు పెట్టుకుంటున్నారు.
కేసీఆర్ దారిలోనే స్టాలిన్ వెళ్తున్నారా అంటే అవుననే అంటున్నాయి పరిణామాలు. ఎందుకంటే స్టాలిన్ కూడా ఇప్పుడు కేంద్రం నియమించిన గవర్నర్ తో తగువు పెట్టుకుంటున్నారు. గవర్నర్ అధికారల్లో కోత విధిస్తున్నారు. తమిళ నాట గవర్నర్ అధికారాలకు సంబంధించి కోత విధిస్తున్నారు. ఇకపై వీసీల నియామకంకు సంబంధించి అన్ని నిర్ణయాలూ తాము మాత్రమే తీసుకుంటామని స్టాలిన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అసెంబ్లీలో బిల్ కూడా మూవ్ చేశారు. యూనివర్శిటీలకు సంబంధించి వైస్ ఛాన్సలర్లను నియమించే క్రమంలో కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని కూడా అంటున్నారాయన. ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం అని కూడా చెప్పారాయన.