ఆర్థిక సాయం పంపిణీలో తొక్కిసలాట.. 78 మంది మృతి

-

యెమన్‌లో ఘోరం చోటుచేసుకుంది. ఆర్థిక సాయం పంపిణీలో జరిగిన తొక్కిసలాటలో 78 మంది మృతిచెందారు. పదుల సంఖ్యలో మంది గాయపడ్డారు. సనాలోని ఓల్డ్‌ సీటీలో వ్యాపారులు ఏర్పాటు చేసిన ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమంలో వందలాది మంది పేదలు గూమిగూడడం వల్ల తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. స్థానిక అధికారులతో సమన్వయం లేకుండా నిధులను యాదృచ్ఛికంగా పంపిణీ చేయడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలు రాగా… వారిని నియంత్రించే ప్రయత్నంలో సాయుధ హౌతీలు గాలిలోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలో ఓ ఎలక్ట్రిక్ వైర్​కు బుల్లెట్ తగిలి మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా ట్రాన్స్ఫార్మర్ పేలడం వల్ల ప్రజలు భయాందోళనకు గురై పరుగులు తీశారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అందరూ ఒకేసారి అటూఇటూ పరుగు పెట్టడం వల్ల తొక్కిసలాట జరిగిందని వెల్లడించారు.

ఘటనాస్థలిలో ఉన్నవారు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. డజన్ల కొద్దీ మృతదేహాలు సహా.. సాయం కోసం క్షతగాత్రులు అరుస్తుండటం వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనలో ఇద్దరు నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నామన్న అధికారులు… పూర్తిస్థాయి దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news