కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక వేధింపుల కేసులో ఆ రాష్ట్ర హోంమంత్రి డాక్టర్ జి పరమేశ్వర మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశారు. రేవణ్ణ భారత్ కి రాగానే విమానాశ్రయంలో అరెస్టు చేయడంపై ప్రత్యేక దర్యాప్తు బృందం నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. మే 31న సిట్ ఎదుట హాజరుకానున్నట్లు వీడియో విడుదలైన నేపథ్యంలో రేవణ్ణను ఎయిర్ ఫోర్ట్ దిగగానే అరెస్టు చేస్తారా అన్న ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే, రేవణ్ణ అరెస్ట్ లో ఎలాంటి జాప్యం లేదని, ఆ వీడియోను విడుదల చేయడానికి అతన్ని ఏం ప్రేరేపించిందో తెలియదని మంత్రి అన్నారు.
మే 31 న ఏం జరుగుతుందో చూద్దాం. అతను రాకపోతే, తదుపరి జరగాల్సిన ప్రక్రియ మొదలవుతుంది. మేము అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నాము. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశాం, వారెంట్ జారీ చేయబడింది. విదేశాంగ మంత్రిత్వ శాఖకు అన్ని వివరాలు అందించాం. అతనికి బ్లూ కార్నర్ నోటీసు కూడా జారీ చేసాము. తదుపరి ఇంటర్పోల్ రంగంలోకి దిగుతుందని హోంమంత్రి తెలిపారు.