రాష్ట్రంలో రోజురోజుకు వీధికుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ప్రజలపై దాడులకు తెగబడుతున్నాయి. ఇటీవల హైదరాబాద్ అంబర్‌పేటలో నాలుగేళ్ల బాలుడిపై దాడి చేసి చంపేశాయి. ఆ తర్వాత చైతన్యపురిలో మరో నాలుగేళ్ల బాలుడిపై దాడికి దిగాయి. వెంటనే అప్రమత్తమైన తల్లిదండ్రులు కుక్కలను తరిమికొట్టగా బాబు బతికి బయటపడ్డాడు.
ఈ ఘటనలు మరిచిపోకముందే వరంగల్ జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. కాశిబుగ్గ పోచమ్మ గుడి వద్ద ఏడేళ్ల బాలుడిపై వీధి కుక్కలు దాడికి దిగాయి. ఇంటి బయట ఆడుకుంటుండగా రోహిత్ అనే బాలుడిపై కుక్కలు దాడి చేశాయి. కుక్కల దాడిలో రోహిత్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంనటే అతడిని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు హైదరాబాద్‌లో కుక్కల దాడుల కట్టడికి జీహెచ్ఎంసీ పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. కుక్కలను పట్టుకునేందుకు ప్రత్యేకంగా ఓ టీమ్‌ను నియమించింది. అంతేకాకుండా వీధి కుక్కల స్వైర విహారానికి అడ్డుకట్ట వేసేందుకు మేయర్ గద్వాల విజయలక్ష్మి అఖిలపక్ష కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.