ఉన్నట్టుండి బరువు పెరిగినా, తగ్గినా మంచిది కాదట..!

-

రీసెంట్ గా ఓ ఫంక్షన్ కి వెళ్లాను. ఆ ఫంక్షన్ లో చాలా రోజుల తర్వాత మా కజిన్ ని చూశాను. ఒకప్పుడు స్లిమ్ గా ఉండే తను సడెన్ గా చబ్బీగా అయిపోయింది. అందరూ ఆమెను చూసి షాక్. అది ఎలా జరిగింది అని అడిగితే తనకీ తెలియదని చెప్పింది. తనకి తెలియకుండా సడెన్ గా బరువు పెరిగిందట. ఇప్పుడు తగ్గడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తోందట. ఇలా తనే కాదు చాలా మంది ఉన్నట్టుండి బరువు పెరిగిపోతారు. ఇంకొందరేమో సడెన్ గా బరువు తగ్గిపోతారు. ఇలా అకస్మాత్తుగా బరువు పెరిగినా.. తగ్గినా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఉన్నట్టుండి బరువు పెరగడానికి , తగ్గడానికి కొన్ని ఆరోగ్య సమస్యలే కారణమని అంటున్నారు. మరి అవేంటో చూద్దామా..!

శరీరంలో హార్మోన్లలో మార్పుల కారణంగా జీవక్రియల పనితీరు నెమ్మదిస్తుంది. ఇది ఒక్కసారిగా బరువు పెరిగేలా చేస్తుందట. అలాగే ఈ హార్మోన్ల అసమతుల్యత పీసీఓఎస్‌కూ దారితీస్తుంది. ఫలితంగా బరువు పెరుగుతారని డాక్టర్లు చెబుతున్నారు. ఒత్తిడి, ఆందోళన, యాంగ్జైటీ.. వంటి మానసిక సమస్యల బారిన పడినప్పుడు శరీరంలో కార్టిసాల్‌ అనే ఒత్తిడి హార్మోన్‌ ఎక్కువగా ఉత్పత్తవుతుంది. ఈ దశను ‘Cushing’s Disease’గా పేర్కొంటున్నారు నిపుణులు. మిలియన్‌ జనాభాలో కేవలం 10-15 మంది మాత్రమే ఈ సమస్య బారిన పడినా.. అందులో 70 శాతం మహిళలే ఉంటున్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనివల్ల పొట్టభాగంలో ఎక్కువగా బరువు పెరుగుతుందంటున్నారు నిపుణులు. డీహైడ్రేషన్‌ సమస్య తలెత్తినప్పుడు అలసట ఆవహిస్తుంది.. దాన్ని గ్రహించలేక మన శరీరం ఆకలి అని పొరబడుతుందట! ఫలితంగా ఏది పడితే అది తినడం వల్ల కూడా ఎక్కువగా బరువు పెరిగిపోతామంటున్నారు నిపుణులు. కాబట్టి శరీరంలో తగినంత నీటి శాతం ఉండేలా జాగ్రత్తపడడం మంచిదంటున్నారు.

వివిధ రకాల క్యాన్సర్ల బారిన పడినప్పుడు తొలి దశలో బరువు తగ్గడం కామన్‌. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ క్యాన్సర్‌ కణతి పరిమాణం పెరుగుతూ పోతుంది. అలాగే ఇది కాలేయం వంటి ఇతర అవయవాలకూ విస్తరిస్తుంది. ఫలితంగా పొట్టలో ద్రవాల స్థాయులు పెరుగుతాయి.. ఇది కూడా కొన్ని సందర్భాలలో బరువు పెరగడానికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు.ఒత్తిడి తగ్గించే మందులు, గర్భ నిరోధక మాత్రలు.. వంటి మందులు కూడా శరీర బరువు పెరగడానికి దోహదం చేస్తాయట!నెలసరి వల్ల కూడా కొంతమంది బరువు పెరుగుతారంటున్నారు నిపుణులు. ఇందుకు.. రుతుక్రమం సమయంలో శరీరం నీరు నిలుపుకోవడం ఓ కారణమైతే, ఈస్ట్రోజెన్‌-ప్రొజెస్టిరాన్‌.. వంటి హార్మోన్ల స్థాయుల్లో మార్పులు మరో కారణమంటున్నారు.

థైరాయిడ్‌ గ్రంథి చురుగ్గా ఉండి ఎక్కువ మొత్తంలో థైరాయిడ్‌ హార్మోన్లను విడుదల చేసే దశను హైపర్‌ థైరాయిడిజంగా పేర్కొంటారు. ఈ క్రమంలో శరీరంలోని క్యాలరీలు ఎక్కువగా కరిగిపోతాయి. ఫలితంగా బరువు కూడా అధికంగానే తగ్గుతాం. డిప్రెషన్‌ మెదడులోని కొన్ని భాగాలపై ప్రతికూల ప్రభావం చూపి ఆకలిని తగ్గిస్తుంది. ఇది బరువు తగ్గడానికి దోహదం చేస్తుందంటున్నారు నిపుణులు. అయితే ఈ సమస్య అందరిలో ఒకేలా ప్రభావం చూపచ్చు.. చూపకపోవచ్చంటున్నారు.

రుమటాయిడ్‌ ఆర్థ్రైటిస్‌ అనేది ఒక ఆటో ఇమ్యూన్‌ సమస్య. అంటే.. మన రోగనిరోధక వ్యవస్థ అనుకోకుండా మన శరీర అవయవాల పైనే దాడి చేయడమన్నమాట! ఈ క్రమంలో ఆకలి మందగించడం, పొట్టలో వాపు.. వంటి దుష్ప్రభావాల వల్ల శరీరానికి తగిన పోషకాలు అందవు. ఇది బరువు తగ్గేందుకు దారి తీస్తుంది.మధుమేహం ఉన్న వారిలో తగినంత ఇన్సులిన్‌ ఉత్పత్తి కాక.. శరీరం శక్తి కోసం కొవ్వులు, కండరాల మీద ఆధారపడుతుంది. అలాగే ఈ సమస్య ఉన్న వారు అధిక చక్కెర స్థాయుల కారణంగా పదే పదే మూత్రవిసర్జనకు వెళ్లడం వల్ల డీహైడ్రేషన్‌కి గురవుతారు. ఈ రెండు కారణాల వల్ల మధుమేహులు బరువు తగ్గడం గమనించవచ్చు.

వివిధ రకాల అనారోగ్య సమస్యలతో పాటు హార్మోన్లలో, మన జీవనశైలిలో మార్పుల కారణంగా శరీర బరువులో హెచ్చుతగ్గులనేవి సహజం అంటున్నారు నిపుణులు. అయితే మీ అలవాట్లలో మార్పులు లేకపోయినా, ఆరోగ్యకరమైన లైఫ్‌స్టైల్‌ అనుసరిస్తోన్నా, వెంటవెంటనే బరువులో హెచ్చుతగ్గులు గమనిస్తే మాత్రం ఓసారి డాక్టర్‌ను సంప్రదించి తగిన చికిత్స, సలహాలు తీసుకోవడం మంచిదంటున్నారు. అలాగే శరీరాకృతితో సంబంధం లేకుండా మనల్ని మనం స్వీకరించడం, అంగీకరించడం అన్నింటికన్నా ముఖ్యం!

Read more RELATED
Recommended to you

Latest news