నేటి సమాజంలో చాల మంది అతి మూత్ర వ్యాధితో బాధపడుతున్నారు. ఒకప్పుడు వృద్ధులు ఈ సమస్యను ఎదుర్కొనేవారు. తాజాగా ఈ సమస్య వయసుతో సంబంధం లేకుండా అందర్నీ పట్టుకుని పీడిస్తోంది. శీతాకాలంలో ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. మూత్రాశయం అతిగా స్పందించడం వల్ల తరచూ మూత్ర విసర్జన చేయాలనే అనుభూతి కలుగుతూ ఉంటుంది. మూత్రాశయ చర్యపై నియంత్రణ ఉండదు. దీంతో అసంకల్పితంగా మూత్రవిసర్జన అనుభూతి కలుగుతుంది. అయితే ఇది జీవనశైలి సమస్యగా మారవచ్చు.
మనరోజువారీ పనులకు ఇబ్బంది కలిగించవచ్చు. దీనివల్ల సామాజిక సంబంధాలు కూడా దెబ్బ తినే అవకాశం ఉంది. చూడటానికి ఇది చిన్న సమస్యనే అయినా.. దీని వల్ల ఎన్నో అవకాశాలు చేజారిపోవచ్చు. ఈ సమస్య మూత్రాశయ ఇన్ఫెక్షన్‌కు కూడా దారి తీయవచ్చు. నిద్రలేమికి ఇది ప్రధాన కారణం కూడా అవుతుంది. అందుకే ఈ సమస్యను మొదట్లోనే నివారించుకునే ప్రయత్నం చేయాలి. ఇందుకోసం కొన్ని ఆహారపదార్థాలను నిపుణులు సూచించారు.
అయితే మూత్ర విసర్జనను అరికట్టడంలో కుంకుడుకాయ కీలక పాత్ర పోషిస్తోంది. కుంకుడుకాయను రాత్రిపూట నీళ్లలో నానబెట్టాలి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆ నీటిని తాగాలి. ఇలా వారంపాటు చేస్తే ప్రయోజనం ఉంటుంది. ఇది మూత్రాశయ విధులను క్రమబద్ధీకరిస్తుంది. అలాగే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ను కూడా నివారిస్తుంది. జీలకర్రను టీ రూపంలో తీసుకోవాలి. టీస్పూన్ జీలకర్రను కచ్చాపచ్చాగా దంచి రెండు కప్పుల శుభ్రమైన నీటిలో వేసి మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి అందులో తేనెను కలుపుకొని సాధారణ టీకి బదులుగా రోజుకు రెండుసార్లు తాగవచ్చు. దీనివల్ల మూత్రాశయ అతిస్పందనలు తగ్గుతాయి.
మూత్రాశయ పనితీరును నియంత్రణలో ఉంచడంలో నువ్వులు బాగా పనిచేస్తాయి. ఇవి గొప్ప క్రియాశీలక పదార్థాలు. తరచుగా మూత్రవిసర్జన సమస్యతో బాధపడుతున్న వారు నువ్వులు, బెల్లం రెండింటితో రుచికరమైన లడ్డూలు చేసుకుని తినడం ద్వారా అతి మూత్ర సమస్యను అధిగమించవచ్చు.
ఉసిరిలో సీ విటమిన్ ఉంటుంది. ఇది మూత్రాశయాన్ని క్లియర్ చేస్తుంది. మూత్రాశయ కండరాలను కూడా బలోపేతం చేస్తుంది. దీంతో అసంకల్పిత మూత్ర విసర్జనపై నియంత్రణ మెరుగుపడుతుంది. తాజా ఉసిరికాయలను గ్రైండ్ చేసి స్వచ్ఛమైన రసాన్ని తీసుకోవాలి. దీనికి తేనెను కలిపి తీసుకోవాలి. అంతే కాదు ఇంకా మెరుగైన ఫలితం కోసం ఉసిరికాయ రసాన్ని పండిన అరటి పండుతో రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల అతిమూత్ర సమస్య త్వరగా నయమవుతుంది.
మూత్రాశయ సంక్రమణ కారణంగా కొన్ని సందర్భాల్లో తరచుగా మూత్రవిసర్జన జరుగుతుంది. మూత్రాశయ ఇన్ఫెక్షన్లను అరికట్టడంలో, మూత్ర విసర్జనను నియంత్రించడంలో తులసి చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఉదయాన్నే 2 లేదా 3 తాజా ఆకులను దంచి ఒక చెంచా తేనెతో తీసుకోవాలి.