కరోనా పరిస్థితుల మధ్య కూడా ఈ ఏడాది ఐపీఎల్ విజయవంతంగా కొనసాగుతోంది. రేపటి రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ తో ఈ మెగా టోర్నీ మొదటి రౌండ్ రాబిన్ లీగ్ పూర్తవుతుంది. అయితే ఐపీఎల్ మధ్య దశకు చేరుకున్న వేళ చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు విజయాలతో దూసుకుపోతున్నాయి. డిపెండింగ్ ఛాంపియన్ హోదాలో అడుగుపెట్టిన ముంబై ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో ప్రదర్శన చేయలేదు. ఇక అటు కోల్ కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ పదర్శన చేస్తున్నాయి.
మొదటి రౌండ్ రాబిన్ లీగ్ లో భాగంగా ఒక్కో జట్టు మిగిలిన ఏడు జట్లలో ఒక్కో మ్యాచ్ ఆడాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, ముంబై జట్లు తొలి నాలుగు స్థానాల్లో కొనసాగుతున్నాయి. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రం ఇప్పటివరకు 6 మ్యాచ్ లు ఆడి కేవలం ఒకే విజయం నమోదు చేసి రెండు పాయింట్లతో అట్టడుగున ఉంది. ఆదివారం సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. ఈ మ్యాచ్ లో సన్‌రైజర్స్ విజయం సాధించకుంటే ఆ జట్లు ప్లే ఆఫ్ ఆశలు మరింత క్లిష్టతరం అవుతాయి.
కాగా సన్‌రైజర్స్ ప్రతి ఏడాది మొదట్లో తడబడినా తర్వాత అనూహ్యంగా పుంజుకోని ప్లే ఆఫ్స్‌కు దూసుకెళుతూ వస్తుంది. అయితే ఈ ఏడాది కేవలం ఇప్పటివరకూ ఒకే విజయం ఉండడంతో సన్‌రైజర్స్‌కు ప్రతి మ్యాచ్ ఎంతో కీలకం కానుంది. అయితే సన్‌రైజర్స్ ప్రధాన బలం బౌలింగ్ అన్న విషయం తెల్సిందే. బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేస్తున్నా బ్యాట్స్ మెన్ విఫలమవడం సన్‌రైజర్స్‌కు ప్రతికూలంగా మారింది.
మరి ముఖ్యంగా సన్‌రైజర్స్‌కు మిడిలార్డర్ సమస్య తప్పడం లేదు. చివర్లో బ్యాట్ తో మెరుపులు మెరిపించే ఆటగాడు లేకపోవడంతో రైజర్స్ దాదాపుగా అన్ని మ్యాచ్ లలో విజయం ముంగిట బోర్లా పడుతుంది. టాప్ ఆర్డర్ విఫలమైతే రైజర్స్ కథ ముగిసినట్టే అన్నట్టు ప్రతి మ్యాచ్ లో ఇదే పునరావృతం అవుతుంది. విలియమ్సన్ రాకతో బ్యాటింగ్ బలపడ్డా… అనుభవం కలిగిన భారత బ్యాట్స్ మెన్ సన్‌రైజర్స్ జట్టులో లేకపోవడంతో పెద్ద మైనస్ గా మారింది. కాగా ఇప్పటికైనా సన్‌రైజర్స్ తిరిగి పుంజుకుంటుందా లేక అదే ప్రదర్శనతో ఈ ఏడాది ప్లే ఆఫ్ చేరకుండానే ఇంటి దారి పడుతుందా చూడాలి.