గత కొన్ని రోజులుగా ఉమ్మడి కృష్ణా జిల్లాలోని మైలవరం నియోజకవర్గం వైసీపీలో ఆధిపత్య పోరు తారస్థాయిలో నడుస్తున్న విషయం తెలిసిందే. మంత్రి జోగి రమేష్, ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమనే పరిస్తితి. ఇరువురు నేతలు సీటు కోసం గట్టిగా ట్రై చేస్తున్నారు. దీంతో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు బురదజల్లుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఒకానొక సందర్భంగా జోగి వర్గం తనని టార్గెట్ చేసి నెగిటివ్ చేస్తుందని వసంత ఆరోపించారు.
ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకుని వివాదం సద్దుమనిగేలా చేయాలని అనుకున్నారు. కానీ అది వర్కౌట్ కాలేదు. దీంతో ఈ పంచాయితీ జగన్ వద్దకు చేరింది. ఈ క్రమంలో జగన్ మైలవరంలో సమస్యలు తెలుసుకుని, మళ్ళీ సీటుని గెలిపించుకుని రావాలని కార్యకర్తలకు సూచించారు. కానీ వసంత-జోగి మధ్య ఉన్న పంచాయితీకి ముగింపు పలకడానికి వారిద్దరిని డైరక్ట్ గా వచ్చి తనని కలవమని సూచించారు. వారు కలిశాకే ఈ పంచాయితీ తెగేలా ఉంది.
కాకపోతే సీటు విషయంలో జగన్ ఆల్రెడీ డిసైడ్ అయినట్లు కనిపిస్తున్నారు. వాస్తవానికి జోగి రమేష్ సొంత స్థానం మైలవరం..వసంత కృష్ణప్రసాద్ వచ్చి నందిగామ నియోజకవర్గానికి చెందిన వారు. అయితే 2014లో జోగి మైలవరంలోనే పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత వసంత టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చి మైలవరం సీటు దక్కించుకున్నారు. ఇక జోగి వచ్చి పెడనలో పోటీ చేశారు. ఇద్దరు జగన్ గాలిలో గెలిచారు. జోగికి మంత్రి పదవి దక్కింది.
అయితే ఇరువురు నేతలకు తమ స్థానాల్లో వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. పైగా మైలవరంలో మళ్ళీ వసంతకు గెలిచే సీన్ లేదని, ఆ సీటులో జోగి పోటీ చేస్తారని ప్రచారం వస్తుంది. ఇటు పెడన సీటు కృష్ణా జెడ్పీ చైర్‌పర్సన్ ఉప్పాల హారిక భర్త రాముకు ఇచ్చి..జోగిని మైలవరంలో నిలబెడతారని తెలుస్తోంది. ఇక వసంతకు సీటు ఉండదని తెలుస్తోంది. మరి చివరికి జగన్ ఏం తేలుస్తారో చూడాలి.