సామాజిక ఉద్యమకారుడు, కవి వరవరరావు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అంగీకరించింది. వరవరరావు బెయిల్ పిటిషన్ ను గురువారం విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై జూలై 11న విచారణ చేపట్టనుంది. భీమా కోరేగావ్ కేసులో నిందితుడిగా ఉన్న వరవరరావు ను మహారాష్ట్ర పోలీసులు చాలా కాలం క్రితమే అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో తనకు బెయిల్ ఇవ్వాలంటూ పలుమార్లు వరవరరావు పిటిషన్లు దాఖలు చేసినా ఆయనకు అనుకూలంగా తీర్పు వెల్లడి కాలేదు.
వరవరరావు ప్రస్తుతం పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. అనారోగ్య కారణాల రీత్యా తనకు బెయిల్ ఇవ్వాలని వరవరరావు దాఖలు చేసుకున్న పిటిషన్ ను బాంబే హైకోర్టు ఇటీవల తోసిపుచ్చింది. బాంబే హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ తాజాగా వరవరరావు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై జూలై 11న విచారణ చేపట్టనున్నట్లు ప్రకటించింది. అయితే పూణే జిల్లా లోని బీమా కోరేగావ్ లో 2018 జనవరి 1న హింస చెలరేగింది.
200 ఏళ్ళ కింద జరిగిన బీమా కోరేగావ్ యుద్ధం స్మరించుకునేందుకు ఎల్గర్ పరిషత్తు నేతృత్వంలో చేసిన ప్రయత్నం చివరికి అల్లర్లకు దారి తీసింది. ఆ అల్లర్లలో ఒకరు మృతి చెందగా పోలీసులతో సహా పలువురు గాయపడ్డారు. వీటితోపాటు నక్సల్స్ తో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలతో వరవరరావుతో సహా ఐదుగురిని 2018 లో పోలీసులు అరెస్టు చేశారు.