ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురువారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సత్యసాయి జిల్లాలోని చిల్లకొండాయపల్లి వద్ద కూలీలతో వెళ్తున్న ఒక ఆటో పై హైటెన్షన్ వైర్లు తెగిపడ్డాయి. ఈ ఘటనలో ఐదుగురు సజీవ దహనం కాగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.
మృతి చెందిన వారిని మహిళా కూలీలు గా గుర్తించారు. కాగా ప్రమాదం జరిగిన సమయంలో 12 మంది ఆటోలో ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మహిళా కూలీల సజీవ దహనం హృదయవిదారకమని అన్నారు. ఈ ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందన్నారు. రెక్కల కష్టం మీద బతికే ఆ కూలీల కుటుంబాల్లో హృదయవిదారకమైన విషాదం చోటుచేసుకుంది అన్నారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని కోరారు.
క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలన్నారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్న సమయంలో అప్పుడప్పుడు విద్యుత్ వైర్లు తెగడం చూస్తూనే ఉంటామని, మరి వాతావరణం సాధారణంగా ఉన్న ఈ రోజున హైటెన్షన్ తీగ తెగిపోవడం మానవ తప్పిదమా? నిర్వహణ లోపమా? అనే విషయం ప్రభుత్వం ప్రజలకు చెప్పవలసి ఉంది అన్నారు. విద్యుత్ చార్జీలు పెంచడం మీద చూపించే శ్రద్ధ విద్యుత్ లైన్ల నిర్వహణపై కూడా చూపాలని ప్రభుత్వానికి సూచించారు.