కుటుంబ తగాదాల్లోకి న్యాయవాదులను లాగొద్దని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సీనియర్ న్యాయవాది, మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీకి శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
‘‘మీ న్యాయపోరాటం వేరు. ఇందులో న్యాయవాదులను తీసుకురాకండి…’’ అని జస్టిస్ సంజీవ్ ఖన్నా వ్యాఖ్యానించారు. దీనికి లలిత్ మోదీ తరఫున న్యాయవాది హరీశ్ సాల్వే.. ఆ పోస్టును ఇప్పటికే తీసేసినట్లు తెలిపారు. లలిత్ మోదీకి, ఆయన తల్లి బీనా మోదీ, ఇతర కుటుంబసభ్యులకు మధ్య ఆస్తుల తగాదా జరుగుతోంది. ఇందులో బీనా మోదీ తరఫున రోహత్గీ న్యాయవాదిగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో రోహత్గీకి వ్యతిరేకంగా సామాజిక మాధ్యమాల్లో లలిత్ మోదీ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనంతరం మరో పోస్టులో క్షమాపణ కూడా చెప్పారు.