కరోనా వైరస్ టెస్టులకు బెంబేలెత్తిపోతున్న ప్రజలకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు శుభవార్త చెప్పింది. ఇకపై దేశంలోని ప్రైవేటు ల్యాబ్‌లు కూడా కరోనా పరీక్షలను ఉచితంగానే చేయాలని కోర్టు తీర్పుచెప్పింది. ఈ మేరకు సుప్రీం కోర్టు బుధవారం తన తీర్పును వెలువరించింది. దేశంలో ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా టెస్టులు, స్క్రీనింగ్‌కు గాను కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ.4500 ఫీజును సవాల్ చేస్తూ.. న్యాయవాది శశాంక్ డియో సుధి వేసిన పిల్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఈ మేరకు నిర్ణయం తీసుకుని తీర్పును వెలువరించింది.
దేశంలో ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా టెస్టులు, స్క్రీనింగ్‌కు గాను రూ.4500 గరిష్ట ఫీజును వసూలు చేసుకోవచ్చని కేంద్రం గతంలో ల్యాబ్‌లకు సూచించిన సంగతి తెలిసిందే. అయితే దేశంలో అనేక మంది పేద ప్రజలు ఉన్నారని.. అలాంటప్పుడు వారు అంత మొత్తం ఎలా వెచ్చించి పరీక్షలు చేయించుకుంటారని.. న్యాయవాది శశాంక్ తన పిల్లో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సెంటర్లలో కరోనా టెస్టులు చేసేందుకు తగినంత సామగ్రి లేదని, అందువల్ల ప్రైవేటు ల్యాబ్‌లలో కరోనా టెస్టులకు అనుమతిచ్చినా.. వాటిల్లోనూ ఉచితంగా టెస్టులు చేసేలా ఆదేశాలు జారీ చేయాలని.. ఆయన సుప్రీం కోర్టును కోరారు.
కాగా శశాంక్ వేసిన పిల్‌ను పలు మార్లు ఇప్పటికే విచారించిన సుప్రీం కోర్టు బుధవారం తీర్పుచెప్పింది. న్యాయమూర్తులు అశోక్ భూషణ్, ఎస్.రవిచంద్ర భట్ లతో కూడిన ధర్మాసనం ఈ మేరకు తీర్పును వెలువరించింది. అయితే ఈ విషయంపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా తన వాదనలను వినిపించారు. ప్రస్తుతం దేశంలో నిత్యం పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఎన్ని ల్యాబ్‌లను ఏర్పాటు చేయాలో, లాక్డౌన్ ఎంత వరకు కొనసాగతుందో చెప్పలేమని తెలిపారు. ఇక ప్రైవేటు ల్యాబ్‌లకు కరోనా టెస్టులు చేసేందుకు అనుమతినిస్తే.. కేవలం ఎన్ఏబీఎల్ అక్రిడిటెడ్ ల్యాబ్స్ లేదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లేదా ఐసీఎంఆర్ గుర్తింపు ఉన్న ల్యాబ్‌లకే.. పరీక్షలకు అనుమతినివ్వాలని కూడా సుప్రీం కోర్టు తన తీర్పులో ఆదేశించింది..!