నేటి నుంచి ప్రాంతీయ భాషల్లో సుప్రీంకోర్టు తీర్పులు

-

ప్రాంతీయ భాషల్లో సుప్రీం కోర్టు తీర్పులు ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానున్నాయి. ఎలక్ట్రానిక్‌ సుప్రీంకోర్టు రిపోర్టుల (ఈ-ఎస్‌సీఆర్‌) ప్రాజెక్టు గురువారం నుంచి మొదలవుతుందని, ప్రస్తుతానికి కొన్ని షెడ్యూల్డు భాషల్లో తీర్పుల అనువాద ప్రతులు సిద్ధంగా ఉంచామని సీజేఐ జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ చెప్పారు. న్యాయవాదులు, న్యాయ విద్యార్థులు, ప్రజలు వాటిని ఉచితంగానే వినియోగించుకోవచ్చని తెలిపారు. దేశంలో గుర్తించిన అన్ని ప్రాంతీయ భాషల్లోకి సుప్రీంకోర్టు తీర్పులను అనువదించే కృషిని కొనసాగిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ-ఎస్‌సీఆర్‌ ప్రాజెక్టులో భాగంగా సర్వోన్నత న్యాయస్థాన వెబ్‌సైట్‌లో ఇప్పుడు 34వేల తీర్పులు ఉన్నాయని సీజేఐ చెప్పారు. అవసరమైన విషయం గురించి సెర్చ్‌ ఇంజిన్‌లో టైప్‌ చేస్తే దానికి సంబంధించిన ఇంగ్లిష్‌ జడ్జిమెంట్‌ ప్రతులు వస్తాయి. దాంతోపాటు ఆ తీర్పులు అనువాదమైన ఇతర భాషల జాబితా కూడా వస్తుంది.

అందులో తమకు ఇష్టం వచ్చిన భాషను ఎంచుకొని సదరు ప్రతిని పరిశీలించుకోవచ్చు. ఈ అనువాద ప్రక్రియ ఇక ముందూ నిరంతరం సాగుతుందని, కక్షిదారుల సౌకర్యార్థం అనువాద ప్రతులను క్రమంగా అప్‌లోడ్‌ చేస్తూ ఉంటామని సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Latest news