తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కొత్త ఛైర్మన్‌ పై క్లారిటీ లేదా

-

తెలంగాణలో భారీ ఎత్తున ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇటు చూస్తే తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌కు పూర్తిస్థాయి చైర్మన్‌ లేరు. పలువురి పేర్లు చర్చకు వచ్చినా.. ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై డైలమా కొనసాగుతూనే ఉంది. పలువురి పేర్లు తెరపైకి వచ్చినా మళ్లీ అదే సస్పెన్స్ అసలు ఈ విషయాన్ని తేల్చుతారా.. నాన్చుతారా అన్నదాని పై ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తుంది.

ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్ కమిషన్‌ TSPSC చైర్మన్‌గా ఉన్న ఘంటా చక్రపాణి పదవీకాలం ఈ నెల 17నే ముగిసింది. అదే రోజు కొత్త చైర్మన్‌ను నియమిస్తారని ప్రచారం జరిగింది. పలువురి పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. గవర్నర్‌ ఆమోదం కోసం ఫైల్‌ను ఏ క్షణమైనా CMO నుంచి రాజ్‌భవన్‌కు వెళ్తుందని అనుకున్నారు. కానీ.. రోజులు గడుస్తున్నా కొత్త చైర్మన్‌పై క్లారిటీ లేదు. అదే సందిగ్ధత కొనసాగుతోంది.

మాజీ ఐపీఎస్‌ అధికారి నవీన్‌చంద్‌ను TSPSC చైర్మన్‌గా నియమిస్తారని.. విదేశాల్లో ఉన్న ఆయన్ని వెంటనే రమ్మని కబురు పంపినట్టు ప్రచారం జరిగింది. ఫలానా రోజున ఆయన బాధ్యతలు చేపడతారనే వార్తలు షికారు చేశాయి. అది కొలిక్కి రాలేదు. ఇంతలో TSPSC సభ్యుడిగా పదవీకాలం ముగిసిన విఠల్‌ను చైర్మన్‌ను చేస్తారని కూడా అనుకున్నారు. గత వారం రోజులుగా నవీన్‌చంద్‌, విఠల్‌ పేర్లపై జరిగిన ప్రచారం అంతా ఇంతా కాదు. కానీ ఎవరి పేరు ఖరారు కాలేదు.

TSPSC చైర్మన్‌ ఎంపిక విషయంలో ప్రభుత్వ పెద్దలు డైలమాలో ఉన్నట్టు సమాచారం. రాజకీయ పరమైన నియామకం చేయాలా.. లేక ఎవరన్నా రిటైర్డ్‌ అధికారిని నియమించాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారట. ఆ పదవికి ఉన్న పరిమితులు.. వచ్చే విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు సమాచారం. TSPSC చైర్మన్‌ లేదా సభ్యులుగా 62 ఏళ్లకు పైబడిన వారు ఉండటానికి చట్టం ఒప్పుకోదు. రిటైర్డ్‌ IASనో.. IPSనో ఎక్కువ రోజులు ఆ పదవిలో ఉండలేరు. కనీసం ఒక్క ఉద్యోగ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయలేరు. ఒకవేళ రాజకీయ పరమైన నియామకం జరిగి ఏదైనా తేడా వస్తే ప్రభుత్వంపై విమర్శలు వస్తాయి.

కమిషన్‌ సభ్యులుగా కొందరి పేర్లు బయటకు వచ్చినా వారు ఆసక్తిగా లేరని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వం 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని అనుకుంటోంది. అందులో ఎక్కువ భాగం పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారానే భర్తీ అవుతాయి. ఇప్పుడు పదవి చేపడితే విమర్శలు వస్తాయని చాలా మంది జంకుతున్నారట. ఇంకోవైపు చైర్మన్‌ను వెంటనే నియమించి ఉద్యోగాల నియామక ప్రక్రియ చేపట్టాలని విద్యార్ధి, యువజన సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. TSPSCలో సభ్యుడిగా ఉన్న కృష్ణారెడ్డిని తాత్కాలిక చైర్మన్‌గా నియమించినా ఉద్యోగ నియామక ప్రక్రియ డౌటేనని కమిషన్‌ వర్గాల కథనం. మరి.. కొత్త చైర్మన్‌ నియామకం విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news