గుంటూరు జిల్లా మాదిపాడులో నిన్న ఆరుగురు వేద విద్యార్థులు కృష్ణా నది లో పడి మరణించిన సంగతి తెలిసిందే. అయితే… ఈ విషాదంపై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి స్పందించారు. మాదిపాడు వేద పాఠశాల విద్యార్థుల విషాద వార్త కంటతడి పెట్టించిందన్నారు స్వరూపానందేంద్ర స్వామి. మృతుల కుటుంబాలను విశాఖ శ్రీ శారదాపీఠం ఆదుకుంటుందని వెల్లడించారు.
అలాగే… 50వేల రూపాయల చొప్పున సహాయం అందిస్తామని ప్రకటించారు స్వరూపానందేంద్ర స్వామి. మిగిలిన విద్యార్థులను మా వేద పాఠశాలలో చదివించడానికి మేము సుముఖంగా ఉన్నట్లు తెలిపారు.
అటు కృష్ణానదిలో పడి విద్యార్థులు మృత్యువాతపడిన ఘటనపై విచారం వ్యక్తంచేశారు హోంమంత్రి సుచరిత. ఆరుగురు వేద పాఠశాల విద్యార్థులు చనిపోవడం అత్యంత భాదకరమన్న హోంమంత్రి… విద్యార్థుల కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సంఘటన పై పూర్తిస్థాయి విచారణ చేపట్టాలని పోలీసులను ఆదేశించారు హోం మంత్రి సుచరిత. బాధిత కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.