కరోనా నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా జరగాల్సిన ప్రధాన క్రీడా టోర్నీలన్నీ ఇప్పటికే వాయిదా పడ్డాయి. ప్రస్తుతం అనేక దేశాల్లో ఆంక్షలను సడలిస్తుండడంతో ఆయా టోర్నీలు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. అయితే అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్‌కప్‌పై మాత్రం ఐసీసీ ఇంకా ఎటూ తేల్చలేదు. ఇప్పటికే ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాలని భావించినా.. ఐసీసీ దాన్ని జూలై వరకు వాయిదా వేసింది. అయితే తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా తాత్కాలిక సీఈవో నిక్ హాక్లీ చేసిన వ్యాఖ్యలు టీ20 వరల్డ్‌కప్‌పై ఆశలను మళ్లీ చిగురింపజేస్తున్నాయి.
టీ20 వరల్డ్‌కప్ సందర్భంగా 15 జట్లు ఆస్ట్రేలియాకు వస్తాయని, స్టేడియాలలో మ్యాచ్‌లను చూసేందుకు వచ్చే అభిమానులను తాము అడ్డుకోలేమని నిక్ హాక్లీ వ్యాఖ్యలు చేశారు. దీంతో టీ20 వరల్డ్‌కప్ జరుగుతుందని ఆయన హింట్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే వరల్డ్‌కప్ నిర్వహణకు సాధ్యమయ్యే అన్ని అంశాలను మాత్రం ప్రస్తుతం ఐసీసీ పరిశీలిస్తోంది. అందుకనే తమ నిర్ణయాన్ని జూలై వరకు వారు వాయిదా వేశారు. అయితే క్రికెట్ ఆస్ట్రేలియా టీ20 వరల్డ్‌కప్ నిర్వహణపై ఆశావహ దృక్పథంతో ఉండడాన్ని గమనిస్తే.. ఆ టోర్నీ కచ్చితంగా జరిగే తీరుతుందని విశ్లేషకులు అంటున్నారు.
మరోవైపు బీసీసీఐ కూడా ఐపీఎల్ టోర్నీపై ఇంకా ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. అవసరం అయితే ఖాళీ స్టేడియాల్లో అయినా సరే.. ఐపీఎల్ మ్యాచ్‌లను నిర్వహిస్తామని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ ఇదివరకే స్పష్టం చేశారు. దీంతో టీ20 వరల్డ్ కప్‌తోపాటు ఇటు ఐపీఎల్‌పైనా ఫ్యాన్స్ గంపెడు ఆశలు పెట్టుకున్నారు. మరి ఏ టోర్నీ జరుగుతుందో చూడాలి.