తిరుపతి లోక్‌సభకు జరగనున్న ఉప ఎన్నికల్లో భారతీయ జనతాపార్టీ – జనసేన ఉమ్మడి అభ్యర్థి ఖరారయ్యారు. తెలుగుదేశం పార్టీ తరఫున మాజీ కేంద్ర మంత్రి పనబాక లక్ష్మి బరిలో ఉన్నారు. ఆమె ఇప్పటికే తన ప్రచారం ప్రారంభించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున అభ్యర్థి ఎవరనేది ఇంకా ఖరారవలేదు. సిట్టింగ్ వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మృతిచెందడంతో తిరుపతి లోక్‌సభకు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తోపాటు తిరుపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తేదీ ఖరారు చేస్తుందనుకున్నారుకానీ వాయిదా వేసింది. మరికొద్దిరోజుల్లో ఎన్నిక తేదీని ప్రకటించబోతోంది.
సర్దుకుపోదాం.. రండి
తిరుపతి నుంచి పోటీచేసే విషయంలో జనసే, బీజేపీ మధ్య కొంతకాలంగా తకరారు నడుస్తోంది. తాము పోటీచేస్తామంటే తాము పోటీచేస్తామంటూ ఇరుపార్టీల నేతలు వేర్వేరుగా ప్రకటించడం ప్రారంభించారు. ఇటీవల జరిగిన పంచాయితీ ఎన్నికల్లో బీజేపీ కనీసం 50 పంచాయితీలనైనా గెలవలేకపోవడంతో జనసేనాని పవన్‌కల్యాణ్ ఆ పార్టీతో పొత్తుపై పునరాలోచనలో పడ్డారని పార్టీవర్గాల సమాచారం. తిరుపతిలో స్థానిక జనసేన నాయకులు ప్రత్యేక సమావేశాలు పెట్టి బీజేపీకి సహకరించమని, జనసేన తరఫునే అభ్యర్థిని నిలబెట్టాలని తీర్మానించారు. ఎన్ని వివాదాలు నడుస్తున్నప్పటికీ బీజేపీ నేత మురళీధర్ తమ పార్టీ తరఫున అభ్యర్థిని నిలబెడుతున్నామని, ఇరుపార్టీ ల మధ్య అంగీకారం కుదిరిందని ప్రకటించడంతో వివాదానికి తెరపడింది.
పవన్ పుస్తకాలు చదువుకోవాలా?
బారతీయ జనతాపార్టీ తరఫున రిటైర్డ్ ఐఏఎస్ దాసరి శ్రీనివాసులు పేరు దాదాపు ఖరారవుతోంది. మరో రెండ్రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో దాసరి శ్రీనివాసులు వివిధ హోదాల్లో పనిచేశారు. పదవీ విమరణ అనంతరం బీజేపీలో చేరారు. పోటీచేయడానికి భారతీయ జనతాపార్టీకి మార్గం సుగమం కావడంతో దాసరినే బరిలోకి దింపాలననేది ఇరు పార్టీల వ్యూహంగా ఉంది. ఆ పార్టీ తరఫున అభ్యర్థి కూడా ఖరారవుతున్నారు కాబట్టి కేంద్ర ఎన్నికల సంఘం తేదీని ప్రకటించబోతోంది. పవన్‌కల్యాణ్ రాజకీయాలపై ఎక్కువ దృష్టిపెట్టకుండా మంచి మంచి పుస్తకాలు చదువుకోమని బీజేపీ చెపుతున్నట్లుగా ఈ వ్యవహారం ఉందని జనసేన శ్రేణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై పవన్ ఏమంటారో మరి..!!