అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఆడవారిపై అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. ఇప్పటికే చదువుకోవడం.. పరీక్షలు రాయడం.. ఉద్యోగాలు చేయడం.. వంటి వాటిపై నిషేధం విధించిన తాలిబన్ సర్కార్ తాజాగా మహిళలు రెస్టారెంట్లకు వెళ్లడంపై నిషేధం విధించింది.
గార్డెన్లు, పచ్చని ప్రదేశాలు ఉన్న రెస్టారెంట్లలోకి మహిళలు వారి ఫ్యామిలీకి అనుమతి లేదంటూ అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి ప్రదేశాల్లో జెండర్ మిక్సింగ్ అవుతుందని మత గురువులు ఇచ్చిన ఫిర్యాదుతో తాలిబన్లు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటివరకు హెరాత్ ప్రావిన్స్‌లో పచ్చని ప్రదేశాలతో ఉన్న రెస్టారెంట్లకు మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని తాలిబన్లు తెలిపారు.
“ఈ రెస్టారెంట్లలోకి పురుషులకు మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రస్తుతం ఈ నిబంధనలను హెరాత్ ప్రావిన్స్‌కు వరకు మాత్రమే పరిమితం చేస్తున్నాం. గార్డెన్ ఉన్న రెస్టారెంట్లలో జెండర్ మిక్సింగ్ కావడం, మహిళలు హిజాబ్ ధరించటం లేదన్న ఆరోపణలతోనే ఈ నిషేధం విధిస్తున్నాం. పార్క్‌లు, పచ్చని ప్రదేశాలు, మహిళలు, పురుషులు కలుసుకోవడానికి వీలున్న రెస్టారెంట్లకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయి.” అని మినిస్ట్రీ ఆఫ్ వైస్ అండ్ వర్ట్యూ డైరెక్టరేట్ డిప్యూటీ అధికారి బాజ్ మహమ్మద్ నజీర్ తెలిపారు.