మరోసారి గవర్నర్ సీఎం కేసీఆర్ మధ్య విభేదాలు రచ్చకెక్కాయి. ఈ సారి గవర్నరే మీడియా సమావేశం పెట్టి మరీ వెల్లడించారు. గత కొన్నాళ్లుగా తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, బీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఖమ్మం బీఆర్ఎస్ సభలో సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యల పట్ల గవర్నర్ తమిళిసై అభ్యంతరం వ్యక్తం చేశారు. గవర్నర్ పదవిని సీఎం కేసీఆర్ అవమానించారని తమిళిసై ఆగ్రహం వెలిబుచ్చారు.
రాజ్యాంగబద్ధమైన గవర్నర్ వ్యవస్థను కేసీఆర్ ఎలా అవహేళన చేస్తారని ప్రశ్నించారు తమిళిసై. తాను 25 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, తనకు ప్రోటోకాల్ తెలుసని తమిళిసై అన్నారు. ప్రోటోకాల్ పై కేసీఆర్ స్పందించాకే రాష్ట్ర ప్రభుత్వ ప్రశ్నలకు సమాధానం చెబుతానని తమిళిసై స్పష్టం చేశారు. రిపబ్లిక్ డే అంశంపై తనకు సమాచారం లేదని ఆమె తెలిపారు తమిళిసై.