టీఎస్పీఎస్సీ క్వశ్చన్ పేపర్ లీకేజీ వ్యవహారంపై 48 గంటల్లో తాజా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సీఎస్, టీఎస్పీఎస్సీ, డీజీపీని ఆదేశించారు. గవర్నర్ ఆదేశాల మేరకు సీఎస్, టీఎస్‌పీఎస్సీ, డీజీపీకి రాజ్‌భవన్ కార్యాలయం లేఖలు పంపించింది. సిట్ దర్యాప్తు ప్రస్తుతం ఏ దశలో ఉందో కూడా.. తెలపాలని లేఖల్లో గవర్నర్ పేర్కొన్నారు. టీఎస్‌పీఎస్సీలో పని చేస్తున్న రెగ్యులర్, పొరుగు సేవల సిబ్బంది ఎంత మంది నియామక పరీక్షలు రాశారో కూడా నివేదిక ఇవ్వాలని చెప్పారు. పరీక్షలకు సన్నద్ధమయ్యేందుకు సెలవులు పెట్టారా.. పరీక్షల్లో వారి ఫలితాలు ఎలా వచ్చాయో తదితర విషయాలను నివేదికలో వివరించాలని తమిళిసై స్పష్టం చేశారు.
మరోవైపు 6వరోజు జరిగిన సిట్ విచారణలో కొత్తగా ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. రమేశ్, సురేశ్, షమీమ్ అనే ముగ్గురు నిందితులను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. అనంతరం కోర్టు వారికి 14రోజుల రిమాండ్ విధిస్తూ.. ఏప్రిల్ 6వరకు గడువు ఇచ్చింది. పేపర్ లీకేజీలో అంతకుముందు పట్టుబడిన 9మంది.. ఇప్పుడు దొరికిన ఈ ముగ్గురిని మొత్తం 12 మందిని చంచల్ గూడ జైలుకు తరలించారు.