‘ఎఫ్3’లో ఓవరాక్షన్ ఎక్కువైంది.. ‘అంటే’ సినిమా నాకర్థం కాలేదు :  తమ్మారెడ్డి భరద్వాజ

-

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ముక్కు సూటిగా .. కచ్చితత్వంతో మాట్లాడేవారు కొందరు ఉన్నారు. వారిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. తాజాగా ఆయన ‘ఎఫ్3’, ‘అంటే సుందరానికీ’ సినిమాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక సినిమాలోనేమో ఓవరాక్షన్ ఎక్కువగా ఉంటే.. మరో చిత్రంలో సాగదీత ఎక్కువైందని అన్నారు. టాలీవుడ్ లో ప్రేక్షకులను థియేటర్ కు రప్పించగల సత్తా ఉన్న సినిమాలు తగ్గిపోయాయని వ్యాఖ్యానించారు. తన సొంత యూట్యూబ్ ఛానెల్ లో ఈ సినిమాల గురించి మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేశారు.
హీరోలు డేట్స్ ఇస్తే చాలు, వాళ్ళు ఒప్పుకొన్న కథలు చేస్తే చాలని నిర్మాతలు అనుకోవడం వల్ల సరైన సినిమాలు రావడం లేదని తమ్మారెడ్డి భరద్వాజ కామెంట్ చేశారు. ప్రేక్షకుడి కోసం ఆలోచించడం లేదని… థియేటర్లు వదిలేసి, ఓటీటీ – శాటిలైట్ కోసం ఆలోచించడం వల్ల ఫలితాలు బాలేదని ఆయన అభిప్రాయపడ్డారు. హీరోలు, శాటిలైట్, ఓటీటీ కోసం సినిమాలు తీయకూడదని… థియేటర్ ప్రేక్షకుల కోసం సినిమాలు తీయాలన్నారు.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్ వంటి భారీ తారాగణంతో ‘ఎఫ్ 3’ రూపొందింది. ఈ సినిమా ఆవరేజ్ అని తమ్మారెడ్డి భరద్వాజ అభిప్రాయపడ్డారు. అంత భారీ తారాగణం ఉన్నందుకు సినిమా మినిమమ్ 100 కోట్లు కలెక్ట్ చేయాలని, రూ. 50 – రూ. 60 కోట్లు చేసిందని ఆయన అన్నారు. జంధ్యాల గారు, బాలచందర్ గారు పరిశ్రమకు రాక ముందు తెలుగులో గానీ, తమిళంలో గానీ కామెడీ విషయంలో కొంచెం ఓవర్ చేసేవారని, ఓవర్ యాక్టింగ్ చేసేవారని… ‘ఎఫ్ 3’లో అటువంటి ఓవర్ యాక్టింగ్ చేసినట్టు అనిపించిందని తమ్మారెడ్డి భరద్వాజ చెప్పుకొచ్చారు. కథ కూడా కొత్తది కాదని, నాలుగైదు సినిమాలు వచ్చాయన్నారు. స్క్రిప్ట్ విషయంలో కూడా క‌న్‌ఫ్యూజ‌న్‌ కనిపించిందని అన్నారు. కంగారుగా తీయడం వల్ల ఆవరేజ్ అయ్యిందన్నారు. లేదంటే వంద, రెండు వందల కోట్లు కలెక్ట్ చేస్తుందని చెప్పారు.
”అంటే సుందరానికీ’ టాక్ బావున్నప్పటికీ… రెవెన్యూ రాలేదు. కామెడీగా తీద్దామనుకున్నారో? లేదంటే సీరియస్‌గా తీద్దామనుకున్నారో? నాకు అర్థం కాలేదు. సినిమా సాగదీశారు. ప్రేక్షకులకు అది అర్థం అవుతుందని తెలిసి, నటుడు హర్ష చేత పతాక సన్నివేశాల్లో డైలాగ్ చెప్పించారు. సాధారణ కథను సాగదీసి, క‌న్‌ఫ్యూజ్‌ చేశారు. నాని లాంటి హీరో సినిమా రూ. 20 – 25 కోట్ల కంటే బిజినెస్ అవ్వదని తెలిసినప్పుడు రూ. 30 – 40 కోట్లు పెట్టి సినిమాలు ఎలా తీస్తున్నారో అర్థం కావడం లేదు. నష్టాలు వస్తే ఎలా? ఒకవేళ బావుండి కలెక్షన్స్ వస్తే సంతోషం.’ అని తమ్మారెడ్డి అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news