సీనియర్ రాజకీయ నాయకుడు, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస నియోజకవర్గం నుంచి విజయం సాధించిన తమ్మినేని సీతారామ్ దశాబ్దంన్నర తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా రాజకీయంగా పునర్వైభవం పొందారు. మూడు ఎన్నికల్లో మూడు వేర్వేరు పార్టీల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఆయన గత ఎన్నికల్లో విజయం సాధించారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు కాగానే స్పీకర్ పదవి రేసులో ఎవరున్నా .. ఎవరు లేక పోయినా.. అనూహ్యంగా జగన్ వేలు మాత్రం.. తమ్మినేని వైపు తిరిగింది. సీనియర్ కావడం, గతంలో టీడీపీలో మంత్రిగా పనిచేసిన అనుభవం ఉండడం, అన్నింటికీ మించి బీసీ వర్గానికి చెందిన నాయకుడు కావడంతో జగన్ ఆయనకు కీలకమైన అసెంబ్లీ స్పీకర్ పదవికి ఎంపిక చేశారు. దీంతో అప్పటి వరకు బీసీలంతా మావోళ్లే.. అని చెప్పుకొనే టీడీపీకి జగన్ వ్యూహాత్మకంగా కళ్లెం వేయగలిగారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.. తాను ఒకటి తలిస్తే(మంత్రి పదవి).. తన పార్టీ అధినేత జగన్ మరొకటి తలిచి.. తనకు స్పీక ర్ పదవి ఇచ్చారే! అని తమ్మినేని ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. స్పీకర్ పదవి అంటే.. రాజ్యాంగ బద్ధమై న పదవి. ఎడా పెడా నోరు పారేసుకునేందుకు పనికొచ్చే పదవి కాదు.. ఎవరినీ విమర్శించే సాహసం చేసే పదవి కూడా అయినప్పటికీ.. తమ్మినేని జగన్ మాటను కాదనేలేక పోయారు. నిజానికి తమ్మినేనికి దూకుడెక్కువ. గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన దూకుడు రాజకీయాలే చేశారు. జిల్లాకు చెందిన సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడితో ఆయనకు అస్సలు పొసిగేది కాదు. అయితే, ఇప్పుడు అధికారంలోకి వచ్చిన వైసీపీలో తనకు దూకుడు తగ్గించుకునే పరిస్థితి ఏర్పడింది. స్పీకర్గా కొన్ని బరులు గీసుకుని ఉండాల్సి వచ్చింది.
అయినప్పటికీ.. తమ్మినేని కొన్ని రోజులు సహించారు తప్ప.. తర్వాత మాత్రం ఇక, ఈ కట్టుబాట్లు నాకెందు కని అనుకున్నారు. అప్పటి నుంచి ఆయన స్పీకర్గా ఉన్నా కూడా దూకుడు పెంచారు. టీడీపీ సహా ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు.“అదొక పార్టీ. ఆయనో నాయకుడు“ అంటూ కామెంట్లు కుమ్మరించారు. అంతేకాదు, అధికారులపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ఈ సారి ప్రొటొకాల్ పాటించకపోతే.. స్పాట్లో కొడతా“ అంటూ ఆర్డీవోపై రుసరుసలాడారు. ఇక, అసెంబ్లీలోనూ ఆయన దూకుడు చూపించారు. మొత్తానికి ఆయన స్పీకర్గానే ఉన్నా.. మంత్రిగా వ్యవహరిస్తున్నారంటూ.. అదే జిల్లాకు చెందిన టీడీపీ నాయకుడు అచ్చెన్న వ్యాఖ్యానించారు.
ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో ఆసక్తికర చర్చ జరిగింది. `రాజధాని రద్దు బిల్లు`.. అని అచ్చెన్న అనగానే.. “కాదు కాదు.. రద్దు కాదు.. వికేంద్రీకరణ బిల్లు“ అని స్పీకర్ స్తానం నుంచి తమ్మినేని వ్యాఖ్యానించారు. దీంతో అచ్చెన్న సార్ మీరు ఆసీటు ఖాళీ చేసి మంత్రిగా వచ్చేయండి సార్! అని అన్నారు. దీంతో ఆయన టైం వచ్చినప్పుడు వస్తాను అచ్చన్నాయుడు.. నీ సంగతి చెప్తా ! అన్నారు. అనూహ్యంగా ఇప్పుడు ఆ సమయం వచ్చిందా? అని వైసీపీ నాయకులు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మండలి రద్దుతో రెండు మంత్రి సీట్లు ఖాళీ అవుతున్నాయి. దీనిలో ఒక సీటును తమ్మినేనికి కేటాయించే యోచన చేస్తున్నారని వైసీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది ఏమేరకు ఫలిస్తుందో చూడాలి. ఇదే నిజమైతే.. తమ్మినేని దూకుడు మరింత పెరుగుతుందనడంలో సందేహం లేదు.