ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న జూనియర్ ఎన్టీఆర్ తన తదుపరి సినిమాల్లో బిజీగా ఉన్నాడు. ఎన్టీఆర్ కొరటాల శివతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. సెమీ పీరియాడిక్ యాక్షన్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ప్రారంభమైంది. ఓ భారీ షెడ్యూల్ కూడా పూర్తయింది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ బుధవారం రాత్రి తన ఇంట్లో పార్టీ అరేంజ్ చేశాడు.
ఈ పార్టీకి పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు అమెజాన్ స్టూడియోస్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ జేమ్స్ ఫారెల్ హాజరయ్యాడు. ఆ పార్టీకి సంబంధించిన ఫొటోలను తారక్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘నా ఫ్రెండ్స్, నాకు కావాల్సిన వాళ్లతో ఒక మంచి సాయంత్రాన్ని గడిపాను. ముఖ్యంగా జేమ్స్, ఎమిలీ మిమ్మల్ని కలవడం చాలా ఆనందంగా ఉంది. మీరు చెప్పిన మంచి మాటలకు, పార్టీలో జాయిన్ అయినందుకు ధన్యవాదాలు’ అంటూ తారక్ పోస్ట్ చేశాడు.
ఇక ఈ పార్టీకి రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్‌లతో పాటు నిర్మాతలు శోభు యార్లగడ్డ, శిరీష్, నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్లు హాజరయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.