ఎన్నికల బహిష్కరణకు,తిరుపతి ఉపఎన్నికకు లింక్ పెట్టి లెక్కలేస్తున్న టీడీపీ

-

తిరుపతి ఉప ఎన్నికల్లో ప్రచారం జోరందుకుంది. ప్రధాన రాజకీయ పక్షాలన్ని పోటాపోటిగా ప్రచారం చేస్తున్నాయి. ఇదే సమయంలో వచ్చిన పరిషత్ ఎన్నికలను బహిష్కరించింది టీడీపీ. దీని పై పార్టీలో పెద్ద గందరగోళమే జరిగింది. ఉప ఎన్నిక వేళ ఈ నిర్ణయం పార్టీకి ఎలా ఉపయోగం అన్న చర్చ సైతం పార్టీలో నడిచింది. ఎన్నికల్లో పోటికి జంకారన్న ప్రచారం ఉప ఎన్నిక పై పడితే మరింత నష్టపోతామని సైతం నాయకులు వాదించారు. అయితే ఈ నిర్ణయంతో లాభం కూడా ఉందని టీడీపీలో మరో వర్గం అభిప్రాయపడుతుంది.

పరిషత్ ఎన్నికల బహిష్కరణ పై నిర్ణయం తీసుకునే సమయంలోనే పోలిట్ బ్యూరోలో తిరుపతి ఉప ఎన్నిక లాభనష్టాల పై సైతం చర్చ జరిగిందట. ఈ వాదనలన్ని పరిగణలోకి తీసుకునే బహిష్కరణ నిర్ణయం తీసుకున్నారట టీడీపీ అధినేత చంద్రబాబు. ఎన్నికల్లో బయపడి వెనకడుగు వేశారని వైసీపీ ఎంత గేళి చేసిన పార్టీ అధినేత లెక్కలు వేరే ఉన్నాయన్న చర్చ తెలుగు తమ్ముళ్లలో నడుస్తుంది. బహిష్కరణ నిర్ణయం వెనుక తిరుపతి ఎన్నికల ఎఫెక్ట్ కూడా ఒక భాగమని తెలుస్తుంది.

ఇప్పుడున్న పరిస్థితుల్లో తిరుపతి లోక్ సభలోని నెల్లూరు పరిధిలోకి వచ్చే అసెంబ్లీ సెగ్మెంట్లలో గానీ తిరుపతి పరిధిలోకి వచ్చే రెండు అసెంబ్లీల్లో గాని స్థానిక ఎన్నికల్లో అనుకూలంగా ఫలితం వచ్చే అవకాశం లేదనే చెప్పాలి. ఉపఎన్నిక కు ముందు రిజల్ట్ వచ్చే ఈ ఎన్నికల్లో పాల్గొనడం వల్ల పెద్ద లాభం లేకపోగా, ఉప ఎన్నికలో మరింత నష్టం జరిగే అవకాశం ఉందని పార్టీ నేతలు చెపుతున్నారు. పోటీలో ఉండి ఓడిపోతే కుదేలైన పార్టీ కేడర్ మళ్లీ వారంలో జరిగే ఉప ఎన్నికల్లో అంత గట్టిగా పని చేసే అవకాశం కూడా ఉండదనేది టిడిపి లెక్క.

పరిషత్ ఎన్నికలు జరిగితే అన్ని స్థానాల్లో ఎలాగు అధికార వైసీపీ గెలుస్తుంది. ఆ తర్వాత ఉప ఎన్నిక జరిగే ప్రాంతంలో మాత్రం తమకు ఓటు వేయమని అభ్యర్దించవచ్చని టీడీపీ నేతల కొత్త ఆలోచనగా చెప్పుకుంటున్నారు. మొన్ననే వైసీపీకి వేశారు కాబట్టి..ఈ ఓటు మాకు వెయ్యండి అని చివరి ఐదు రోజులు ప్రచారం చేస్తాం అంటున్నారట స్థానిక టిడిపి నేతలు. దీని ద్వారా ఉప ఎన్నిక జరిగే అసెంబ్లీ నియోజకవర్గాల్లో బహిష్కరణ నిర్ణయం కొంత మేర లాభిస్తుందని లెక్కలేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. ఈ ఈక్వేషన్ ఎంత వరకు ఫలిస్తుందో…బహిష్కరణ మేలు చేస్తుందో లేక తిరగబెడుతుదో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news