ప్రభుత్వం ఎన్ని మాటలు చెబుతున్నా కరోనా వేళ ప్రజలు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల తరపున తెలుగుదేశం పార్టీ పరంగా ప్రభుత్వం ముందు కొన్ని డిమాండ్లు, సూచనలు ఉంచారు. ప్రభుత్వం వీటిపై రాజకీయాలకు అతీతంగా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కరోనా కిట్లు, బ్లీచింగ్ కొనుగోళ్లు, 108వాహనాల్లో అవినీతి క్షమించరానిదన్న చంద్రబాబు… దీనిపై సమగ్ర విచారణ జరపాలన్నారు. కేంద్రం కరోనా నివారణకు ఇచ్చిన నిధులపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. మద్యం సేవిస్తే రోగనిరోధక శక్తి తగ్గి కరోనా వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తక్షణమే మద్యం దుకాణాలను మూసివేయాలని డిమాండ్ చేశారు.కరోనాను జయించటమే ప్రతిఒక్కరి ధ్యేయం కావాలని చంద్రబాబు అన్నారు.
ఎస్సీ యువకుడు వరప్రసాద్‌కు టిడిపి అధినేత చంద్రబాబు రూ.2లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. పోలీసుల సమక్షంలో ఆ యువకుడికి శిరోముండనం చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితుల పట్ల వైఎస్ఆర్సిపి నాయకులు, అధికార పార్టీ నేతలు దుర్మార్గాలను ఆపకుంటే రాష్ట్ర వ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. దళితుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి… వారిని అణచివేసేలా వ్యవహరించడం సరికాదన్నారు.