ఉత్తరాంధ్రలో ఇద్దరు మాజీ మంత్రులు సైకిల్ దిగేందుకు రెడీగా ఉన్నారు. వీరిలో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు వైసీపీ గూటిలో చేరేందుకు రెడీగా ఉంటే.. మరో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు బీజేపీ కండువా కప్పుకునేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఇక ఉత్తరాంధ్రలో పార్టీ నుంచి గెలిచిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలు సైతం జగన్ చెంత చేరేందుకు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ వార్తలు ఇలా ఉంటే కనీసం చంద్రబాబు రాజధాని ఉండాలని కోరుతోన్న అమరావతిలోనూ ఆయన్ను.. ఆయన పార్టీని నమ్మేందుకు సొంత పార్టీ నేతలు సిద్ధంగా లేరని అంటున్నారు.
ఓ వైపు చంద్రబాబు అమరావతి రాజధానిగా ఉండాలని హడావిడి చేస్తున్నా అదే అమరావతి పరిధిలో ఉన్న నేతలు బాబును నమ్మడం లేదు. తాజాగా కృష్ణా జిల్లాలో చంద్రబాబు సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గానికే చెందిన ఓ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే సైతం పార్టీని వీడి బయటకు వచ్చేందుకు రెడీగా ఉన్నారని తెలుస్తోంది. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఓ రేంజ్‌లో అధికారం వెలగబెట్టిన సదరు నేతపై అప్పుడే అనేక రకాల ఆరోపణలు వచ్చాయి.
ఇక గత ఎన్నికల్లో ఓడిన సదరు నేత పూర్తిగా సైలెంట్ అయ్యారు. గన్నవరం ఎమ్మెల్యే వంశీ ఇప్పటికే దగ్గరైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సదరు మాజీ ఎమ్మెల్యేను సైతం వైసీపీలోకి తీసుకువచ్చే బాధ్యతను వంశీయే తీసుకున్నట్టు టాక్..? ఈ నేత పార్టీ మారితే టీడీపీకి విజయవాడలో కోలుకోలేని దెబ్బే అవుతుంది.