గుంటూరు జిల్లా బాపట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ పుంజుకుందా ? జోరు పెరిగిందా ? ఇక్కడ టీడీపీని మళ్లీ అక్కున చేర్చుకునే స్థాయిలో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయా ? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. మరి దీనికి కారణం ఏంటి ? ఎవరు ? అంటే. అందరి వేళ్లూ.. ప్రముఖ పారిశ్రామిక వేత్త, నాలుగు నెలల క్రితమే టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా నియమితులు అయిన వేగేశ్న నరేంద్ర వర్మవైపే చూపిస్తున్నాయి. సౌమ్యుడిగా వివాద రహితుడిగా.. అందరినీ కలుపుకొని పోయే నాయకుడిగా నరేంద్ర వర్మ పేరు తెచ్చుకున్నారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయన వేగేశ్న.. ఫౌండేషన్ ద్వారా పేదలకు చాలా చేరవయ్యారు.
పార్టీలో పదవులు లేకపోయినా.. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ పార్టీ బాధ్యతలు చూసిన నాయకులు కాడి కింద పడేసినా నరేంద్రవర్మ మాత్రం సొంత ఖర్చుతో అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అటు బాపట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు టీడీపీ కేడర్‌కు దగ్గరయ్యారు. అదే సమయంలో తన చారిటీస్ ద్వారా విస్తృత సేవాకార్యక్రమాలు చేపట్టారు. ఈ క్రమంలోనే 2019 ఎన్నికల్లో నరేంద్రవర్మకు బాపట్ల టీడీపీ సీటు వస్తుందన్న అంచనాలు ఉన్నా కూడా చివర్లో క్యాస్ట్ ఈక్వేషన్లతో మిస్ అయ్యింది. అయితే ఆ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన అప్పటి ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ పార్టీ ఓడిన కొద్ది రోజులకే పార్టీ ఫిరాయించేశారు.
2014లోనూ ఇక్కడ నుంచి సతీష్ పోటీ చేసి ఓడినా.. ఐదేళ్ల పాటు పార్టీ అధికారంలో ఉండి.. నియోజకవర్గ ఇన్‌చార్జ్‌తో పాటు ఎమ్మెల్సీగా ఉన్నా కూడా పార్టీ బలపడలేదన్న టాక్ ఉంది. ఈ క్రమంలోనే 2019లో మరోసారి ఆయనే పోటీ చేసినా ఓడిపోయారు. సతీష్ పార్టీ మారిన వెంటనే బాపట్ల టీడీపీలో ఒక్కసారిగా అగాథం నెలకొంది. ఎప్పుడు అయితే పార్టీ అధిష్టానం ఆయన్ను ఇన్‌చార్జ్‌గా నియమించిందో అప్పటి నుంచే ఇక్కడ టీడీపీ జెట్ రాకెట్ స్పీడ్‌లో టాప్ గేర్‌తో దూసుకుపోతోంది అనేకంటే వర్మ దూసుకు పోయేలా చేస్తున్నారనే చెప్పాలి. వాస్తవానికి ఇక్కడ 1999 నుంచి టీడీపీకి సరైన దశ, దిశ లేదు. అందుకే 1999 ఎన్నికల తర్వాత పార్టీ జెండా ఇక్కడ ఎగరలేదు.
2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో వరుసగా ఓడిపోయింది. ఎంత మంది నాయకులు వచ్చినా కేడర్‌ను పట్టించుకున్న దాఖలాలు లేవు. చివరకు మాజీ మంత్రి గాదె వెంకటరెడ్డి టీడీపీలోకి వచ్చారు. ఆయన గత ఎన్నికల్లో తన కుమారుడికి సీటు ఇవ్వలేదని… పార్టీ ఓడిందని వెంటనే వైసీపీలోకి జంప్ చేసేశారు. ఓవరాల్‌గా బాపట్ల టీడీపీలో ఎంతో మంది నాయకులు ఎన్నికల్లో ఓడిపోయాకో లేదా సీటు రాలేదనో స్వార్థ రాజకీయాలను నమ్ముకుంటూ పార్టీని బలహీనం చేసుకుంటూ వచ్చారు. అందుకే ఇక్కడ ఇరవై ఏళ్లలో పార్టీ ఒక్కసారి కూడా గెలవలేదు. అయినప్పటికీ.. వేగేశ్న నరేంద్ర వర్మ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పార్టీ నుంచి పదవులు లేకపోయినా అహరహం శ్రమించడంతో పాటు నియోజకవర్గంలో ప్రతి ఇంటికి పాదయాత్ర చేశారు.
చంద్రబాబు, లోకేష్ కూడా వర్మకు ప్రాధాన్యం పెంచారు. దీంతో నరేంద్ర వర్మ.. ఇక్కడ పార్టీ కార్యక్రమాల్లో వేగం పెంచారు. కరోనా నేపథ్యంలోనూ నియోజకవర్గంలో పార్టీలతో సంబంధం లేకుండా ప్రజలకు విస్తృత సేవలు అందించారు. పార్టీ పిలుపు ఇస్తోన్న ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారు. ఇక్కడ రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం చేపట్టే ఏ ప్రజా వ్యతిరేక అంశంపై అయినా వెంటనే కౌంటర్లు ఇస్తున్నారు. నియోజకవర్గ ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయారు. వాస్తవానికి ఎన్నికలకు ముందే వర్మ నాయకత్వం కోరుకున్న న్యూట్రల్ పీపుల్ కూడా ఇప్పడు ఆయనకు దగ్గరయ్యారు. దీంతో పార్టీలతో సంబంధం లేకుండా ఆయన గ్రాఫ్ అక్కడ పెరుగుతోన్న మాట వాస్తవం. ఏదేమైనా ఈ నాలుగు నెలల్లో బాపట్ల టీడీపీకి వచ్చిన ఊపు గత కొన్ని సంవత్సరాల్లో రాలేదనే చెప్పాలి.