ఎన్టీఆర్ ఆశయం జగనే తీర్చాలంటున్న టీడీపీ నేతలు!

-

అది 1994 సార్వత్రిక ఎన్నికల సమయం… తెలుగుదేశం పార్టీ స్థాపకుడు ఎన్.టి.రామారావు సంపూర్ణ మద్యపాన నిషేధం నినాదంతో జనంలోకి వెళ్ళి బంపర్ మెజారిటీతో అధికారలోకి వచ్చిన సమయం. తాను ఇచ్చిన మాట ప్రకారం అధికారం చెప్పట్టిన అనంతరం ఆయన ఉమ్మడి ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం అమలు చేశారు. కాకపోతే అనతికాలంలోనే… కేవలం ఎనిమిది నెలలు మాత్రమే ఆయన అధికారంలో ఉన్నారు. అనంతరం ఆయనను కూలదోసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. మద్యపాన నిషేధం హామీని వెంటనే తుంగలోకి తొక్కారు.. పూర్తిగా మద్యం అమ్మకాలకు తెరలేపడం, వాటికి బోనస్ గా బెల్ట్ షాపుల కల్చర్ ని కూడా ప్రవేశపెట్టడం వరుసగా జరిగిపోయాయి!

కట్ చేస్తే… 2014 ఎన్నికల సమయం వచ్చేసింది. నవ్యాంధ్రలో ఎన్నికల వేల బెల్టు షాపులన్నీ ఎత్తేస్తానని, తాను ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే మొదటి ఐదు సంతకాల్లో ఒకటి ఈ విషయంపైనే ఉంటుందని బాబు నొక్కి వక్కానించారు. ఎన్నికల అనంతరం ఆ వ్యవహారంపై నక్కి నక్కినట్లు వ్యవహరించారు… బెల్టు షాపులు పదింతలు పెంచేశారు! మద్యాన్ని అతి కీలకమైన ఆదాయవనరుగా మార్చారు! అవన్నీ మరిచిన బాబు… తాజాగా జగన్ సర్కార్ పై చిందులు వేస్తున్నారు! మద్యం రేట్లు దారుణంగా పెంచేశారని ఒకసారి అంటూ, మద్యం దుకాణాలు మూసేయాలని మరోసారి అంటున్నారు… వెంటనే… సరైన బ్రాండ్లు, తమకు తెలిసిన బ్రాండ్లు అమ్మడం లేదని చెబుతున్నారు!

ఇలా మాట్లాడుతున్న బాబు… తానుమాత్రం మద్యనిషేధానికి అనుకూలమో, వ్యతిరేకమో క్లియర్ గా చెప్పకుండా… తమ తెలుగు మహిళా నేతలతో… మద్యపానం ఆరోగ్యానికి హానికరం లాంటి డైలాగులు చెప్పిస్తున్నారు. ఈ విషయంలో తెలుగు మహిళా ఏపీ అధ్యక్షురాలు వంగలపూడి అనిత… జగన్ ఏపీలో సంపూర్ణ మద్య నిషేధం విధించాల్సిందేనని.. మహిళల ఆరోగ్యానికి మద్యం చేటు అని చెప్పుకొస్తున్నారు! ఇదంతా బాగానే ఉంది కానీ అయిదేళ్ళూ మద్యం ఏరులై పారించిన చంద్రబాబు జమానాలో ఈ మహిళా నేతలకు… మహిళల ఆరోగ్యం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం లాంటి సంగతులు గుర్తుకు రాకపోవడం ఆశ్చర్యకరమే!

ఇక్కడ విషయం ఏమిటంటే… నిజంగా మధ్యపాన నిషేధంపై టీడీపీ మహిళా నేతలకు ఇప్పటికైనా జ్ఞానోదయం అయ్యి జగన్ పై ఆ డిమాండ్ చేస్తుంటే… తమ పార్టీ స్థాపించిన పెద్దాయన ఆశయాలు ఇక బాబు ఎలాగూ తీర్చలేరు కాబట్టి… రాజకీయ ప్రత్యర్ధి అయినా పర్లేదు కనీసం జగన్ అయినా తీర్చాలని కోరుకుంటున్నట్లు అర్ధం చేసుకోవచ్చు! లేకపోతే… ఇంతకాలం బాబు పాలనలో మద్యం ఏరులై పారుతున్న పట్టించుకోని వారు ఇప్పుడు చేస్తున్న విమర్శలను… కేవలం రాజకీయ విమర్శలుగా మాత్రమే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

ఈ లెక్కన చూసుకుంటే… టీడీపీ పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు ఆశయం కూడా జగనే తీర్చాలి అన్న రేంజ్ లో తెలుగు మహిళా నేతలు స్పందించడం గొప్ప విషయమే! ఇకపై టీడీపీ పార్టీ నేతలు అందరూ కూడా ఎన్టీఆర్ ఆశయాలను జగన్ మాత్రమే నెరవేర్చగలరని బలంగా నమ్ముతుండటం జగన్ కు శుభపరిణామమే అనుకోవాలేమో!!

Read more RELATED
Recommended to you

Latest news