మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వెళ్లే మార్గంలో కరకట్ట వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి ప్రాంతంలో ఉన్న ప్రజావేదిక కూల్చి నేటికి ఏడాది అయింది. ఈ సందర్భంగా ప్రజావేదిక శిథిలాలను పరిశీలించేందుకు టీడీపీ నేతలు అక్కడికి వెళ్లే ప్రయత్నం చేశారు. కరకట్ట వద్ద ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని పోలీసులు బారికేడ్లను ఏర్పాటు చేసి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, టీడీపీ నేతలకు మధ్య వాగ్వివాదం, తోపులాట చోటు చేసుకున్నాయి.
అలాగే, చంద్రబాబు ఇంటికి వెళ్లే మార్గాన్ని పోలీసులు మూసేశారు. దేవినేని ఉమ, వర్ల రామయ్యతో పాటు పలువురు నేతలు ఆ వైపుగా వెళ్లకుండా అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో తాము చంద్రబాబు నివాసానికి వెళుతుంటే పోలీసులు అడ్డుకున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. కరోనా నిబంధలు తమకు తెలుసని.. తమ అధినేత ఇంటికి వెళ్లనివ్వరా అంటూ ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో దేవినేని ఉమ, వర్ల రామయ్య, కొల్లు రవీంద్ర, నక్క ఆనందబాబులను అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.